సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్
| తెలుగు మార్కెట్‌లో మళ్లీ పట్టు సాధించిన సూర్యకు ‘సీన్’ సినిమా మరో పరీక్షగా మారింది. ‘కంగువ’, ‘రెట్రో’ నిరాశపరిచినా, ‘వీరభద్రుడు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఆయన మార్కెట్ మెరుగుపడింది. ఇప్పుడు ‘సీన్’ తెలుగు హక్కులను ఎన్‌వీఆర్ సినిమా రూ.15 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం. బయ్యర్లు సేఫ్ కావాలంటే రూ.25-30 కోట్ల గ్రాస్ అవసరమని ట్రేడ్ వర్గాల అంచనా. థియేటర్లలో ఇతర సినిమాల పోటీ, స్క్రీన్ల కేటాయింపు వసూళ్లపై ప్రభావం చూపనున్నాయి.
తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలకు ఇక్కడ భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. అయితే గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి మారిపోయింది. వరుస పరాజయాల తర్వాత ఈ ఏడాది మళ్లీ పుంజుకున్న సూర్య ఇప్పుడు 'సీన్' సినిమాతో వచ్చారు. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.30 కోట్ల గ్రాస్ అవసరమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక రీసెంట్ సూర్య తెలుగు మార్కెట్ పరిస్థితిపై ఓ లుక్కేస్తే..
2024లో భారీ అంచనాలతో వచ్చిన 'కంగువ' తెలుగు బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. ఆ సినిమా తెలుగు హక్కుల విలువ దాదాపు రూ.30 కోట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'రెట్రో' కూడా నిరాశపరిచింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.8 కోట్ల షేర్ అవసరం కాగా, ఫైనల్‌గా రూ.3.53 కోట్ల షేర్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
అయితే 2026లో సూర్యకు పరిస్థితి మెరుగుపడింది. 'కరుప్పు' తమిళంలో భారీ విజయం సాధించగా, తెలుగులో 'వీరభద్రుడు'గా విడుదలైంది. దాదాపు రూ.30 కోట్ల గ్రాస్ వరకు వసూలు చేసినట్లు కొన్ని ట్రేడ్ కథనాలు పేర్కొన్నాయి. కానీ తమిళంలో వచ్చిన స్థాయి విజయం తెలుగులో దక్కలేదు. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మాత్రం తెలుగు బయ్యర్లకు మంచి లాభాలు అందించింది.
'విశ్వనాథ్ అండ్ సన్స్' తెలుగు హక్కుల విలువ సుమారు రూ.20 కోట్లుగా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.30 కోట్లకు పైగా షేర్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. మొత్తం గ్రాస్ దాదాపు రూ.58 కోట్ల వరకు నమోదైనట్లు అంచనాలున్నాయి. దీంతో సూర్య తెలుగు మార్కెట్‌పై బయ్యర్లకు మళ్లీ నమ్మకం పెరిగింది. ఆ ప్రభావంతోనే ఇప్పుడు 'సీన్' హక్కులకు కూడా మంచి ధర పలికినట్లు తెలుస్తోంది.
'సీన్' తెలుగు హక్కులను ఎన్‌వీఆర్ సినిమా దాదాపు రూ.15 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం. విడుదల ఖర్చులతో కలిపి రూ.25-30 కోట్ల గ్రాస్ వస్తే బయ్యర్లు సేఫ్ అయ్యే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే 'రామాయణం', 'ఆదర్శ కుటుంబం' సినిమాలు థియేటర్లలో ఉండటంతో 'సీన్'కు స్క్రీన్ల కేటాయింపు విషయంలో పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా తొలి వారంలో సరిపడా షోలు దొరకడం వసూళ్లకు కీలకం.
మలయాళంలో 'ఆవేశం'తో గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నజ్రియా హీరోయిన్‌గా నటించగా, 'ప్రేమలు' ఫేమ్ నస్లెన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. సూర్య, జ్యోతిక నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. దీపావళి సెలవుల నేపథ్యంలో మొదటి వీకెండ్‌లో వచ్చే వసూళ్లతోనే అసలు లెక్కను రాబట్టాలి. మరి సూర్య క్రేజ్ ఈసారి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.