రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!
| రాజకీయాలకు విరామం ఇచ్చిన అనిల్ శెట్టి ఏడాది పాటు సినీ రంగాన్ని అధ్యయనం చేసి ‘లంబోదర 2.0’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కుంభమేళాలో నెల రోజులు గడిపిన సమయంలోనే ఈ సినిమా కథను సిద్ధం చేశారు. సింపుల్ సుని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ సోషల్ థ్రిల్లర్‌లో కునాల్ కపూర్ టెక్ కంపెనీ హెడ్‌గా నటిస్తున్నారు. ఏఐ, డిజిటల్ బానిసత్వం, నిజమైన ఆనందం వంటి అంశాలతో పాటు హ్యూమనాయిడ్ రోబోట్‌ను కూడా ఇందులో చూపించనున్నారు.
పరిశ్రమలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరి వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంటుంది. అయితే రాజకీయ రంగం నుంచి పూర్తిగా భిన్నమైన సినీ ప్రయాణాన్ని ఎంచుకుని ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న అనిల్ శెట్టి జర్నీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్వీయా రచన..నిర్మాణం.. ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నడ చిత్రం `లంబోదర 2.0` రిలీజ్ కు రెడీ అవుతోన్న నేపథ్యంలో అనీల్ అనుసరించిన బాట అందరినీ ఆకర్షిస్తోంది. రాజకీయ జీవితానికి కాస్త విరామం ఇచ్చి సినిమా ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు అనిల్ శెట్టి ఏడాది పాటు తీవ్రంగా శ్రమించారు.
ఈ ప్రయాణంలో భాగంగా కుంభమేళాలో నెల రోజుల పాటు గడిపిన ఆయన అక్కడే `లంబోదర 2.0` సినిమా స్క్రిప్ట్‌కు రూపకల్పన చేశారు. ఈ వినూత్న ఆలోచనను ప్రారంభించే ముందు శ్రేయోభిలాషులైన సునీల్ శెట్టి, యశ్, కిరణ్ మజుందార్-షా , నందన్ నీలేకని వంటి దిగ్గజాల సలహాలు తీసుకుని వారి ప్రశంసలు పొందడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు సింపుల్ సునిని ఒప్పించడంతో సినిమా రూపురేఖలు మారిపోయాయి. టెక్ కంపెనీ హెడ్ పాత్రలో కునాల్ కపూర్ నటిస్తుండగా కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చూడని సరికొత్త సైన్స్-ఫిక్షన్ సోషల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
కృత్రిమ మేధస్సు -ఆధునిక సాంకేతికత మానవ సంతోషాన్ని ఏ విధంగా కొలవగలవు అనే సరికొత్త పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా లైక్స్, ఫాలోవర్లు, అల్గారిథమ్‌ల చుట్టూనే మనుషుల ఆనందం తిరుగుతోందనే వాస్తవాన్ని ఈ సినిమా ప్రశ్నిస్తోంది. అసలు ఆనందం అంటే ఏంటి? డిజిటల్ బానిసత్వం నుంచి నిజమైన స్వేచ్ఛ పొందడం ఎలా? అనే అంశాలపై ఈ చిత్రం చర్చను లేవనెత్తుతుంది.
అలాగే ఈ చిత్రంలో భారతదేశపు మొట్టమొదటి నిజమైన హ్యూమనాయిడ్ రోబోట్ కనిపించబోతుండటం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. సినిమాలో ఎంత టెక్నాలజీ ఉన్నా? దాని ప్రధాన బలం మాత్రం భావోద్వేగాల చుట్టూనే నడుస్తుందని అనిల్ శెట్టి స్పష్టం చేశారు. కేవలం ఫార్ములా సినిమాలు కాకుండా కంటెంట్ ఆధారిత చిత్రాలే పరిశ్రమకు జీవనాడి అని గట్టిగా నమ్ముతున్నారు. ప్రముఖ నటుడు అనంతనాగ్ గతంలో నటించిన `గణేశన మదువె` చిత్రంలోని `లంబోదర` పాత్ర స్ఫూర్తితోనే ఈ టైటిల్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించారు.
సాంకేతిక హంగులతో కూడిన సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్‌లో అనిల్ చేసిన సాహసోపేతమైన ప్రయాణం శాండిలివుడ్ చిత్ర పరిశ్రమకు సరికొత్త దిశను చూపించనుంది. ప్రేక్షకుల ఆలోచనలను రేకెత్తించే వినూత్న ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో? చూడాలి.