భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!
| భారీ బడ్జెట్ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్లో సన్ పిక్చర్స్, హోంబలే ఫిలిమ్స్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. సన్ పిక్చర్స్ రజనీకాంత్ 'జైలర్', 'కూలీ'తో పాటు అల్లు అర్జున్-అట్లీ 'రాకా'ను నిర్మిస్తోంది. మరోవైపు హోంబలే 'కేజీఎఫ్', 'సలార్', 'కాంతార' ఫ్రాంచైజీలతో విజయాలు అందుకుంది. సన్ పిక్చర్స్ స్టార్ హీరోలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతుండగా, హోంబలే కొత్త కథలు, ఫ్రాంచైజీలను సృష్టిస్తూ భారీ ప్రాజెక్టులను కొనసాగిస్తోంది.
ఇండియన్ సినిమాలో వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. కానీ భారీ సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు కొన్ని నిర్మాణ సంస్థల పేర్లు గట్టిగానే హైలెట్ అవుతున్నాయి. అందులో సన్ పిక్చర్స్, హోంబలే ఫిలిమ్స్ ముందుంటాయి. ఒకటి తమిళ ఇండస్ట్రీ నుంచి, మరొకటి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియా మార్కెట్లో బలమైన గుర్తింపు సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ఈ రెండు బ్యానర్ల నుంచి సినిమా వస్తుందంటే నిర్మాణ విలువల విషయంలో ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.
మొదట సన్ పిక్చర్స్ విషయానికొస్తే రజనీకాంత్‌తో చేసిన 'జైలర్' భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 'కూలీ', 'జైలర్ 2' వంటి పెద్ద ప్రాజెక్టులను నిర్మించింది. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో 'రాకా'ను కూడా తెరకెక్కిస్తోంది. స్టార్ హీరోల పారితోషికాలు, భారీ సెట్స్, విదేశీ షెడ్యూల్స్, ఇతర భాషల నటీనటులతో ఈ సంస్థ సినిమాల స్థాయిని పెంచుతోంది. ముఖ్యంగా పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గడం లేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
ఇక హోంబలే ఫిలిమ్స్ ట్రాక్ మరోలా సాగింది. 'కేజీఎఫ్'తో కన్నడ సినిమా మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ సంస్థ, రెండో భాగంతో మరింత పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ప్రభాస్‌తో 'సలార్'ను భారీ స్థాయిలో నిర్మించింది. మరోవైపు 'కాంతార' తక్కువ బడ్జెట్‌తో రూపొంది భారీ వసూళ్లు సాధించింది. ఆ విజయంతో 'కాంతార: చాప్టర్ 1'ను మరింత పెద్ద స్థాయిలో తెరకెక్కించారు. ఇలా ఒకే తరహా సినిమాలకు పరిమితం కాకుండా వేర్వేరు కథలపై పెట్టుబడులు పెడుతోంది.
అయితే ఈ రెండు సంస్థల నిర్మాణ విధానంలో తేడా కనిపిస్తోంది. సన్ పిక్చర్స్ ఎక్కువగా ఇప్పటికే భారీ మార్కెట్ ఉన్న హీరోలతో సినిమాలు చేస్తుంటే, హోంబలే మాత్రం 'కేజీఎఫ్', 'కాంతార' వంటి కొత్త ఫ్రాంచైజీలను సృష్టించింది. వాటికి సీక్వెల్స్, ప్రీక్వెల్స్ రూపంలో మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఏర్పడింది. ఈ రెండు పద్ధతుల్లోనూ రిస్క్ ఉంటుంది. స్టార్ హీరో సినిమా అయినంత మాత్రాన పెట్టుబడి తిరిగి వస్తుందనే గ్యారంటీ ఉండదు. అలాగే మొదటి భాగం హిట్ అయినా రెండో భాగానికి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు.
భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే సంస్థలు ఇండస్ట్రీలో ఇంకా చాలానే ఉన్నాయి. అయితే సన్ పిక్చర్స్, హోంబలే ఫిలిమ్స్ ప్రత్యేకత ఏంటంటే ఒక భారీ సినిమా పూర్తవుతుండగానే మరో పెద్ద ప్రాజెక్టును లైన్లో పెడుతుండటం. ఇతర నిర్మాణ సంస్థలు పెద్ద సినిమాల మధ్య చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు కూడా చేస్తుంటే, ఈ రెండు బ్యానర్లు వరుసగా భారీ ప్రాజెక్టులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. పైగా మిగతా వాళ్ళ కంటే సినిమాలతో మంచి లాభాలు కూడా అందుకున్నాయి.
ప్రస్తుతం సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'రాకా'పై భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్‌కు 'పుష్ప' తర్వాత పెరిగిన మార్కెట్, అట్లీకి ఉన్న కమర్షియల్ ట్రాక్ రికార్డ్ ఈ ప్రాజెక్టుకు బలంగా ఉన్నాయి. మరోవైపు హోంబలే 'కేజీఎఫ్', 'కాంతార' ఫ్రాంచైజీలతో పాటు 'మహావతార్' యానిమేషన్ చిత్రాలపైనా వర్క్ చేస్తోంది. భారీ స్టార్ సినిమాలు, పౌరాణిక నేపథ్యం ఉన్న యానిమేషన్ ప్రాజెక్టులు అంటూ రెండు సంస్థలు వేర్వేరు విభాగాల్లో పెట్టుబడులు పెడుతుండటం హైలెట్.