సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!
| భారీ అంచనాలున్న సినిమాల నుంచి అగ్ర నటీనటులు, దర్శకులు వరుసగా తప్పుకోవడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ‘ఓ మై గాడెస్ 3’ నుంచి రాణి ముఖర్జీ, అమిత్ రాయ్, ‘హేరా ఫేరి 3’ నుంచి ప్రియదర్శన్, ‘డాన్ 3’ నుంచి రణ్‌వీర్ సింగ్, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణే వైదొలగడం ఆసక్తి రేపుతోంది. క్రియేటివ్ విభేదాలు, ఒప్పందాలు, పారితోషికం వంటి అంశాలు ఈ పరిణామాలకు కారణాలుగా చర్చకు వస్తున్నాయి.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్‌ల నుంచి అగ్ర నటీనటులు - ప్రముఖ దర్శకులు అర్థాంతరంగా తప్పుకోవడం ఇటీవల కాలంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమాలు సెట్స్ పైకి వెళ్లకముందే లేదా షూటింగ్ జరుగుతున్న సమయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా నటీనటులు, మేకర్స్ మధ్య విభేదాలు తలెత్తడం సాధారణమే అయినా? ఈ మధ్య కాలంలో పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.
స్టార్ డైరెక్టర్లు ప్రియదర్శన్, అమిత్ రాయ్ నుండి మొదలుకొని రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే వంటి ప్రముఖుల వరకు పలువురు క్రేజీ ప్రాజెక్ట్‌ల నుంచి బయటకు రావడం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రముఖ దర్శకుడు అమిత్ రాయ్ - నటి రాణి ముఖర్జీ కాంబినేషన్‌లో వస్తుందన్న ప్రకటనతో భారీ అంచనాలు నెలకొల్పిన `ఓ మై గాడెస్ 3` ప్రాజెక్ట్ అనూహ్య సమస్యల్లో చిక్కుకుంది. దర్శకుడు అమిత్ రాయ్ -మేకర్స్ మధ్య తలెత్తిన క్రియేటివ్ విభేదాల కారణంగా ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు.
అంతకు ముందు రాణి ముఖర్జీ కూడా ఇదే ప్రాజెక్ట్ నుంచి వైదొలగడంతో సీక్వెల్ భవితవ్యం ప్రస్తుతం గందరగోళంలో పడింది. ఇలాంటి ఉదంతాలే చిత్ర పరిశ్రమలో ప్రణాళికా లోపాలను, మేకర్స్ మధ్య సమన్వయ లేమిని స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి. మరోవైపు ఎంతోకాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న కల్ట్ కామెడీ ఫ్రాంచైజీ `హేరా ఫేరి 3` నుంచి సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ తప్పుకోవడం కోలీవుడ్ .. బాలీవుడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ ప్రాజెక్ట్‌లో ఎన్నో సంక్లిష్టతలు ఉన్నాయని భవిష్యత్తులో సినిమా అసలు రూపుదిద్దుకుంటుందనే నమ్మకం తనకు లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.
`హేరా ఫేరి 3` మాత్రమే కాకుండా `మలమాల్ వీక్లీ 2` సీక్వెల్ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఆయనతో పాటు నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కూడా ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు వార్తలు రావడం పరిశ్రమలో చర్చనీ యాంశమైంది. అలాగే స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన `డాన్ 3` ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అత్యంత వివాదాస్పద పరిణామాలలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిట్ వివాదం కారణంగా నటుడికి, మేకర్స్‌కు మధ్య తీవ్రమైన మనస్పర్థలు వచ్చి న్యాయపరమైన వివాదం స్థాయికి చేరుకోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఫిల్మ్ అసోసియేషన్ల జోక్యంతో చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో నటీనటులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో? అలాగే మేకర్స్‌తో ఒప్పందాల పరంగా ఎలాంటి ఘర్షణలు తలెత్తుతున్నాయో ? ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. మరోవైపు నటి దీపికా పదుకొణే `స్పిరిట్`, `కల్కీ 2` వంటి రెండు వరుస సౌత్ ప్రాజెక్ట్‌ల నుంచి వైదొలగడం ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకే దారితీసింది.
నటి వైపు నుంచి నిబంధనలు పారితోషికంపై డిమాండ్లు ఉండగా మేకర్స్ మాత్రం ప్రొఫెషనల్ కాని డిమాండ్లని ఆరోపించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇలాంటి ఉన్నత స్థాయి ప్రాజెక్ట్‌ల నుంచి ఆర్టిస్టులు అర్ధాంతరంగా తప్పుకోవడం సినిమాల నిర్మాణ షెడ్యూల్స్‌ను దెబ్బతీయడమే కాకుండా సినిమాపై ప్రేక్షకులలో ఉండే అంచనాలను కూడా దెబ్బతీస్తుంది.