కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!
| కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా 'సండియర్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రక్తపు మరకలతో కారులో కనిపిస్తున్న కమల్ లుక్ ఆకట్టుకుంటోంది. గతంలో 'విరుమాండి' సినిమాకు కూడా ఇదే టైటిల్‌ను అనుకున్నప్పటికీ, చివరకు మార్చిన విషయం తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో, విశ్వనటుడు కమల్ హాసన్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ వచ్చేసింది. నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు సండియర్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ సినిమాకు ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్దార్థ్ హీరోగా వచ్చిన చిత్తా, విక్రమ్ నటించిన వీర ధీర సూరన్ వంటి సినిమాలతో అరుణ్ కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కమల్ హాసన్‌తో కలిసి సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమవుతోంది. కారులో రక్తపు మరకలతో కనిపిస్తున్న కమల్ హాసన్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. ఆయన ముఖంలో కనిపిస్తున్న సీరియస్ నెస్, పోస్టర్‌లోని డార్క్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్స్ కలగలిపిన కథతో ఈ సినిమా ఉండబోతుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. గతంలో కమల్ హాసన్ నటించిన విరుమాండి సినిమాకు మొదట సండియర్ అనే టైటిల్‌నే అనుకున్నారు. అయితే అప్పటి పరిస్థితుల కారణంగా చివరి నిమిషంలో ఆ పేరును విరుమాండిగా మార్చారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అదే పేరుతో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.