హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!
| చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన లింగ వివక్ష ..బడ్జెట్ కేటాయింపుల్లో వ్యత్యాసాలపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన లింగ వివక్ష ..బడ్జెట్ కేటాయింపుల్లో వ్యత్యాసాలపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కథానాయకుల సినిమాలకు వందల కోట్లు గుమ్మరించే నిర్మాతలు.. హీరోయిన్ కేంద్రంగా సాగే సినిమాలకు మాత్రం ఎందుకంత వెనుకంజ వేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఓ మీడియా ఈవెంట్లో మాట్లాడిన కృతి ఇండస్ట్రీలో మహిళా నటుల పట్ల చూపిస్తున్న వివక్షపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
హీరోయిన్ల నటన, స్టాండర్డ్స్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మార్పు వచ్చినా? బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ల విషయంలో మాత్రం ఇంకా పాతకాలపు ఆలోచనా విధానమే కొనసాగుతోందని కృతి సనన్ ఆవేదన వ్యక్తం చేశారు. `పఠాన్`, `ధురంధర్` లాంటి భారీ విజువల్స్, యాక్షన్ అంశాలతో కూడిన సినిమాలను పురుష నటులతోనే కాకుండా మహిళా ప్రధాన పాత్రలతో కూడా నిర్మించవచ్చని ధీమా వ్యక్తం చేశారు. కథలో సత్తా ఉంటే ప్రేక్షకులు మహిళా యాక్షన్ సినిమాలను కూడా భారీ ఎత్తున ఆదరిస్తారని స్పష్టం చేశారు.
పాన్-ఇండియా రేంజ్లో తెరకెక్కే యాక్షన్ డ్రామాల్లో నటించేందుకు తాము ఎంతో సిద్ధంగా ఉన్నామని అయితే నిర్మాతలు ఆ స్థాయి రిస్క్ చేయడానికి ముందుకు రావాలని కృతి విజ్ఞప్తి చేశారు. `నటీనటుల లింగంతో సంబంధం లేకుండా మీరు నమ్మిన మంచి కథకు అంతే స్థాయిలో భారీ బడ్జెట్ కేటాయించే ధైర్యం ప్రొడ్యూసర్లకు ఉండాలి. హీరోయిన్ లీడ్ రోల్ అనగానే బడ్జెట్ కోతలు విధించే సంస్కృతి మారాలి` అని వ్యాఖ్యానించారు.
ఇప్పటి వరకు వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా వరకు పరిమిత బడ్జెట్లోనే తెరకెక్కిన విషయాన్ని కృతి గుర్తు చేశారు. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ .. గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన కథను హీరోయిన్ భుజాలపై పెట్టి తీస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని కృతి అభిప్రాయపడ్డారు. అలాంటి భారీ వసూళ్లను సాధించగల సత్తా.. స్టార్ డమ్ .. మార్కెట్ కెపాసిటీ ప్రస్తుత నటీమణులకు ఉందని హామీ ఇచ్చారు.
బాక్సాఫీస్ వద్ద లింగ సమానత్వం రావాలంటే నిర్మాతలు మాత్రమే కాదు. ప్రేక్షకుల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలని కృతి పిలుపునిచ్చారు. థియేటర్లలో సినిమాను నటీనటుల లింగాన్ని బట్టి కాకుండా కంటెంట్ బట్టి చూడాలని కోరారు. ఒక మహిళా ప్రధాన చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే ఇండస్ట్రీ మొత్తం ఆటోమేటిక్‌గా వైఖరిని మార్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. మాటలకే పరిమితం కాకుండా స్వయంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి వైవిధ్యమైన సినిమాలు తీస్తున్న కృతి రాబోయే రోజుల్లో అయినా ఇండస్ట్రీలో మహిళా ప్రాధాన్యత కలిగిన భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలకు బాటలు వేస్తుందేమో చూడాలి.