'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్రకటించారు కానీ..!
| ఈ ప్రాజెక్ట్‌లు పట్టాలు ఎక్కకపోవడానికి ప్రధాన కారణం భారత రక్షణ శాఖ నుంచి అలాగే ఆర్మీ నుంచి అనుమతులు లభించకపోవడమే.
పాకిస్తానీ ముష్కరులపై భారత సైన్యం చేపట్టిన అత్యంత సాహసోపేతమైన `ఆపరేషన్ సింధూర్` ఇతివృత్తంగా బాలీవుడ్‌లో సినిమా తీసేందుకు చాలా మంది ప్రముఖ నిర్మాతలు పోటీ పడ్డారు. సంజయ్ లీల భన్సాలీ, రోనీ స్క్రూవాలా వంటి దిగ్గజాలతో పాటు దాదాపు 10 మంది నిర్మాతలు టైటిల్స్ రిజిస్టర్ చేయించుకుని ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అయితే ప్రకటనల వరకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్‌లు ఒక్కటీ కూడా షూటింగ్ దశకు (సెట్స్‌పైకి) వెళ్లకపోవడం వెనుక బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌లు పట్టాలు ఎక్కకపోవడానికి ప్రధాన కారణం భారత రక్షణ శాఖ నుంచి అలాగే ఆర్మీ నుంచి అనుమతులు లభించకపోవడమే. యథార్థ సైనిక ఆపరేషన్ల ఆధారంగా సినిమాలు తీసేటప్పుడు భారత సైన్యం నుంచి `నో అబ్జెక్షన్ సర్టిఫికేట్` (ఎన్.వో.సీ) పొందడం తప్పనిసరి. మిలిటరీ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ డేటా, రక్షణ రంగానికి సంబంధించిన రహస్యాలు.. సైన్యం, ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు ఆర్మీ నిబంధనలను అత్యంత కఠినంగా పరిశీలిస్తుంది. భన్సాలీ సహా పలువురు సమర్పించిన స్క్రిప్ట్‌లలో నాటకీయత ఎక్కువగా ఉండటం వల్ల లేదా భద్రతా నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో మిలిటరీ నుంచి సంబంధిత అధికారులు అనుమతులను నిరాకరించారు.
ఈ రేసులో అందరికంటే భిన్నంగా నిలిచి సైన్యం నుంచి అధికారిక ఆమోదం పొందిన ఏకైక ప్రాజెక్ట్‌గా కార్తీక్ ఆర్యన్ - వివేక్ అగ్నిహోత్రిల కాంబినేషన్ నిలిచింది. `ది కాశ్మీర్ ఫైల్స్` ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో, కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ `ఆపరేషన్ సింధూర్` చిత్రానికి రక్షణ శాఖ నుంచి అవసరమైన అన్ని రకాల క్లియరెన్సులు లభించాయి. రియలిస్టిక్ డ్రామాలను తెరకెక్కించడంలో వివేక్ అగ్నిహోత్రికి ఉన్న శైలి ..ఆర్మీ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా స్క్రిప్ట్ డిజైన్ చేయడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
సైన్యం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ ప్రాజెక్ట్‌ను టి-సిరీస్ (భూషణ్ కుమార్), అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ - కార్తీక్ ఆర్యన్‌కు చెందిన డోపమైన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ రాసిన పుస్తకంలోని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఆర్మీ పర్మిషన్ లభించడంతో త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.
దేశభక్తి, మిలిటరీ థ్రిల్లర్ కథలకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్నా కానీ... యథార్థ సంఘటనల ఆధారంగా సినిమా తీసేటప్పుడు ఆర్మీ నిబంధనలను పాటించడం ఎంత కీలకమో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. భన్సాలీ, రోనీ స్క్రూవాలా వంటి దిగ్గజాలు వెనకబడిపోగా.. పక్కా స్క్రిప్ట్.. అధికారిక అనుమతులతో కార్తీక్ ఆర్యన్-వివేక్ అగ్నిహోత్రి జోడీ ఈ ప్రతిష్టాత్మక పోరులో ముందంజ వేసింది. అయితే భన్సాలీ, రోనీ ఆపరేషన్ సింధూర్ పై ప్రాజెక్టున పక్కన పెట్టామని అధికారికంగా ప్రకటించలేదు. ఆ రెండు ప్రాజెక్టులు కూడా ఇంకా ఆన్ లోనే ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఛాంబర్ లో టైటిల్స్ రిజిస్టర్ చేసుకున్న చాలా మంది ప్రీప్రొడక్షన్ పనుల్లోనే కాలయాపన చేస్తున్నారని కూడా గుసగుసలు ఉన్నాయి.