అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!
| సౌత్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకోవడం, ఆ తర్వాత ఉత్తరాది వేదికలపై కూర్చుని అదే ఇండస్ట్రీ కథలను, ఆచారాలను కించపరచడం కొందరికి అలవాటుగా మారిపోయిందనే కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి.
సౌత్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకోవడం, ఆ తర్వాత ఉత్తరాది వేదికలపై కూర్చుని అదే ఇండస్ట్రీ కథలను, ఆచారాలను కించపరచడం కొందరికి అలవాటుగా మారిపోయిందనే కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇటీవల ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న ఓ ప్రముఖ నటి, గతంలో తాను చేసిన తెలుగు సినిమాలోని పాత్రపై పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్ద వయసు హీరోతో పెళ్లి, అక్కడి సంప్రదాయాలపై ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
లేటెస్ట్ గా ఈ వ్యవహారంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఘాటుగా స్పందించారు. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకుండానే చాలా హుందాగా, అంతే సూటిగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు ఎస్కేఎన్. ఇక్కడ అవకాశాలు అందుకుని, మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కొన్నేళ్లకు అదే పరిశ్రమను, ఇక్కడి కథలను, సాంస్కృతిక సంప్రదాయాలను విమర్శించడం ఒక దురదృష్టకరమైన పోకడగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నటీనటులకు తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంటుందని, కానీ ఒక వ్యక్తిగత విమర్శకు, ఆదరించిన పరిశ్రమను చిన్నచూపు చూసే ధోరణికి చాలా తేడా ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగు సినిమాకు, దక్షిణాది చిత్రసీమకు ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు, విలువలు ఉంటాయని ఎస్కేఎన్ గుర్తుచేశారు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఇక్కడి సంప్రదాయాలు, కథల్లోని బంధుత్వాలు వింతగా అనిపించవచ్చు గానీ, స్థానిక సంస్కృతిలో అవి సర్వసాధారణమైనవని గట్టిగా బదులిచ్చారు.
మన నేటివిటీని, ఆచారాలను అర్థం చేసుకోకుండా కేవలం తమకు నచ్చలేదనే కారణంతో కించపరిచేలా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ భావోద్వేగాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అలాగే అవకాశాలు దక్కినప్పుడు సంతోషంగా పారితోషికాలు తీసుకుని, కెరీర్ ఒక స్థాయికి చేరిన తర్వాత అదే నేపథ్యాన్ని అవమానించడం కరెక్ట్ కాదని ఎస్కేఎన్ తేల్చిచెప్పారు.
నిర్మాణాత్మక విమర్శలను పరిశ్రమ ఎప్పుడూ ఆహ్వానిస్తుందని, కానీ తమదే గొప్ప సంస్కృతి అనే సాంస్కృతిక ఆధిపత్య ధోరణిని ఎవరూ స్వాగతించలేరని కుండబద్దలు కొట్టారు. అవసరం తీరాక రంగులు మార్చే తీరు సరైంది కాదనే భావన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. గతంలోనూ కొందరు నటీమణులు బాలీవుడ్ ఇంటర్వ్యూలలో ఇలాగే తెలుగు చిత్రసీమను చులకన చేస్తూ మాట్లాడి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
ఒకప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సౌత్ మార్కెట్ ను వాడుకుని, ఇప్పుడు ఇంటలెక్చువల్ ట్యాగ్ తగిలించుకోవడానికి ఇక్కడి కమర్షియల్ సినిమాలను తక్కువ చేయడం పరిపాటిగా మారింది. అందుకే ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి. పరిశ్రమ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఆయన చెప్పిన మాటలకు టాలీవుడ్ సినీ ప్రియుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. మిమ్మల్ని గౌరవించిన పరిశ్రమను మీరు కూడా గౌరవించండి అంటూ ఎస్కేఎన్ ఇచ్చిన మాట నిజంగా ఆలోచింపజేసేలా ఉంది.