విజయ్ - అజిత్ అదరగొట్టేశారు.. ఫ్యాన్స్ వార్ కు చెక్?

ముఖ్యమంత్రి హోదాలో ఉండే వారు.. ఆ ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి వ్యక్తిగత భావోద్వేగాల్ని దాచుకోకుండా బాహాటంగా ప్రదర్శించటం చాలా అరుదు.

Update: 2026-09-13 08:39 GMT

ముఖ్యమంత్రి హోదాలో ఉండే వారు.. ఆ ప్రోటోకాల్ ను పక్కన పెట్టేసి వ్యక్తిగత భావోద్వేగాల్ని దాచుకోకుండా బాహాటంగా ప్రదర్శించటం చాలా అరుదు. ఎప్పుడో కానీ.. ఎక్కడో కానీ చోటు చేసుకోదు. తాజాగా అలాంటి సన్నివేశం తమిళ ప్రజల్ని మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల వారిని సైతం ఫిదా అయ్యేలా చేస్తోంది. ఇందుకు కారణం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యవహరించిన తీరే. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తమిళ సినీ ఇండస్ట్రీలో విజయ్ - అజిత్ కుమార్ మధ్య మూడు దశాబ్దాలకు పైనే తీవ్రమైన బాక్సాఫీస్ పోటీ.. అధిపత్య పోరు ఉండేది. అయితే.. వ్యక్తిగతంగా మాత్రం వీరిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధమే ఉండేది. అయితే.. వీరి అభిమానుల మధ్య మాత్రం తీవ్రమైన గొడవలు మాత్రమే కాదు.. సోషల్ మీడియా యుద్ధాలు సాగేవి.

ఇందుకు భిన్నంగా దేశం కాని దేశంలో జరిగిన ఒక ఈవెంట్ లో తమిళ హీరో అజిత్ పాల్గొంటే.. ఆ కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఒక సన్నివేశం.. స్నేహానికి అధికారం ఎప్పుడూ అడ్డంకి కాబోదన్న సందేశాన్ని ఇవ్వటమే కాదు.. ప్రోటోకాల్ అన్నది మనకు మనం ఏర్పాటు చేసుకున్న ఒక వలయమే తప్పించి.. మరింకేమీ కాదన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

మిచెలిన్ లీ మాన్స్ కప్ ఐదో రౌండ్ రేస్ యూకేలోని సిల్వర్ స్టోన్ గ్రాంగ్ పిక్స్ సర్క్యూట్ లో జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు సీఎం విజయ్ తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ కు వెళ్లారు. ఈ అంతర్జాతీయ రేస్ నిర్వాహకులు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా 44 రేసింగ్ కార్ల గ్రిడ్ కు గ్రీన్ ఫ్లాగ్ ఊపి అధికారికంగా రేసును ఆరంభించారు. దీనికి ముందు జరిగిన ఒక సన్నివేశం అందరిని ఆకర్షిస్తోంది. అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.

సినిమాలు ఓవైపు.. మరోవైపు తన ఇష్టమైన కార్ రేసింగ్ లో పాల్గొంటున్న తమిళ హీరో అజిత్ కుమార్ తన సొంత రేసింగ్ టీం అజిత్ రెడ్ యాంట్ బై విరాజ్ తరఫున నంబరు 16 లిజియర్ ప్రోటోటైప్ కారుతో ఎల్ ఎంపీ3 ప్రో/ఎఎం కేటగిరీలో ఈ రేసులో పాల్గొన్నారు. ఈ రేస్ ప్రారంభానికి ముందు ట్రాక్ మీద అజిత్ కుమార్ ను కలిశారు విజయ్. ట్రాక్ మీద అజిత్ కుమార్ కనిపించినందనే.. అప్పటివరకు సీఎంగా గంభీరంగా ఉన్న విజయ్ ఒక్కసారిగా యూత్ ఫుల్ గా మారిపోయారు. తన వాకింగ్ మూమెంట్స్ ను మ్యాజికల్ గా మార్చేసి.. అలాంటి మూవ్ మెంట్స్ తో నడుచుకుంటూ అజిత్ వద్దకు వచ్చి ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ గా మారింది.

దశాబ్దాల తరబడి బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన ఇద్దరు అగ్రనటులు.. ఒకరు ముఖ్యమంత్రిగా.. మరొకరు అంతర్జాతీయ రేసర్ గా మారి.. విదేశీ గడ్డ మీద ఎదురు పడిన సందర్భంలో వ్యవహరించిన తీరును చూస్తే మాత్రం.. పోటీ పడాలి కానీ ఆ పోటీ వ్యక్తిగత జీవితాల్లోకి రాకూడదు. వ్యక్తిగత స్నేహాన్ని అధిగమించకూడదన్న విషయాన్ని చెప్పేస్తుంది. అభిమానులు కూడా తమ అభిమానాన్ని అభిమాన నటుడి మీద చూపించేలా కానీ.. ఆ పేరుతో తమ వైరి వర్గానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకోకూడదన్న విషయాన్ని అర్థం చేసుకోవటం ముఖ్యం. పోటీ ఉంటేనే ఎదుగుతాం. అలా అని పోటీ పేరుతో పోట్లాటలు కూడా సరికాదన్న సందేశాన్ని తాజా ఉదంతం స్పష్టం చేసిందని చెప్పాలి.

Tags:    

Similar News