దెయ్యాలు నిజమేనా? వరుణ్ తేజ్ టీమ్ రియాక్షన్!
దెయ్యాల గురించి టీమ్ సభ్యులు ఇచ్చిన ఫన్నీ రియాక్షన్స్ నెటిజన్లను భలేగా నవ్విస్తున్నాయి..
టాలీవుడ్‌లో సరికొత్త ప్రాజెక్ట్‌లతో అలరించే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హార్రర్ కామెడీ మూవీ ఆగస్టు 7న విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, ప్రమోషన్లలో భాగంగా మూవీ టీమ్ జరిపిన సరదా చిట్‌చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దెయ్యాల గురించి టీమ్ సభ్యులు ఇచ్చిన ఫన్నీ రియాక్షన్స్ నెటిజన్లను భలేగా నవ్విస్తున్నాయి..
కమ్‌బ్యాక్ కోసం 'కొరియన్ కనకరాజు':
బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ కోసం చూస్తున్న వరుణ్ తేజ్‌కు ఈ సినిమా పక్కా కమ్‌బ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 'గండీవధారి అర్జున', 'ఆపరేషన్ వాలెంటైన్', 'మట్కా' వంటి ప్రయోగాల తర్వాత వరుణ్ తేజ్ పూర్తిగా రూట్ మార్చి ఈ హార్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకోవడానికి ఈ ‘కొరియన్ కనకరాజు’తో సిద్ధమయ్యారు.
"సినిమా దెయ్యాలంటేనే నాకు భయం!":
మూవీ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన చిట్‌చాట్‌లో "మీకు దెయ్యాలంటే భయమా?" అని అడిగిన ప్రశ్నకు వరుణ్ తేజ్ తనదైన శైలిలో స్పందించారు. "నాకు నిజమైన దెయ్యాల కంటే కూడా సినిమాల్లో చూపించే దెయ్యాలను చూడటమే చాలా భయం" అని వరుణ్ నవ్వుతూ చెప్పడం విశేషం.
దెయ్యాలను నమ్ముతారా?.. టీమ్ ఆన్సర్స్:
ఇక ఈ చిట్‌చాట్‌లో "మీరంతా దెయ్యాలను నమ్ముతారా?" అని వరుణ్ తేజ్ అడగ్గా.. కమెడియన్ సత్య "నేను నమ్ముతాను" అని ఓపెన్‌గా చెప్పారు. హీరోయిన్ రితికా నాయక్ కూడా "యస్.. నేను కూడా ఖచ్చితంగా నమ్ముతాను" అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
మేర్లపాక గాంధీ మాస్ అండ్ ఫన్నీ పంచ్:
ఈ సంభాషణలో దర్శకుడు మేర్లపాక గాంధీ ఇచ్చిన రిప్లై మాత్రం నెట్టింట రచ్చ లేపుతోంది. "పెళ్లికి ముందు వరకు నేను దెయ్యాలను అస్సలు నమ్మేవాడిని కాదు... కానీ పెళ్లి తర్వాత మాత్రం నమ్ముతున్నా" అంటూ ఆయన వేసిన కామెడీ పంచ్‌కు అక్కడున్న వారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వేశారు. ఈ క్లిప్ ప్రస్తుతం మీమ్ పేజీల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ సినిమా ఫస్టాఫ్ అంతా వరుణ్ తేజ్, కమెడియన్ సత్య మధ్య వచ్చే హిలేరియస్ సీన్లు, ఒక కొరియన్ అమ్మాయితో నడిచే ఇంట్రెస్టింగ్ లవ్ ట్రాక్‌తో ప్రేక్షకులను సరదాగా నవ్విస్తూ సాగిపోతుందట. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ కథను మలుపు తిప్పుతుండగా, సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, అందులో వరుణ్ తేజ్ నటన ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.
ఆగస్టు 7న హార్రర్ కామెడీ నవ్వులు:
టీజర్‌తో పాటు ప్రమోషనల్ వీడియోలు కూడా ఫుల్ ఫన్‌గా ఉండటంతో 'కొరియన్ కనకరాజు' సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. వరుణ్ తేజ్, సత్య, మేర్లపాక గాంధీ కాంబినేషన్ థియేటర్లలో ఎలాంటి నవ్వుల పువ్వులు పూయిస్తుందో చూడాలంటే ఆగస్టు 7 వరకు ఆగాల్సిందే