సైలెంట్‌గా 100 కోట్ల క్లబ్‌కు చేరువగా 'రిజెక్టెడ్' సినిమా
బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే భారీ ప్రమోషన్లు, భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు అవసరం లేదని కొన్ని సినిమాలు నిరూపిస్తుంటాయి.
బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే భారీ ప్రమోషన్లు, భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు అవసరం లేదని కొన్ని సినిమాలు నిరూపిస్తుంటాయి. ఎటువంటి ముందస్తు అంచనాలు లేకుండా వచ్చి ఆరంభంలో ప్రేక్షకులు తిరస్కరించినట్లు అనిపించినా... కేవలం కథలోని బలం, రివ్యూలు, మౌత్ టాక్ తో సైలెంట్‌గా అద్భుతాలు సృష్టిస్తున్న చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా'. బాలీవుడ్ పాపులర్ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ దేశ విభజన నాటి రొమాంటిక్ డ్రామా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మైలురాయికి అత్యంత చేరువగా వచ్చి తన థియేటర్ ప్రదర్శనను ముగించింది.
దేశ విభజన నేపథ్యంలాంటి సున్నితమైన- భావోద్వేగపూరితమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన కొత్తలో చాలా తక్కువ వసూళ్లతో చాలా సాధారణమైన ఆరంభ వసూళ్లనే పొందింది. అయితే సినిమాను చూసిన ప్రేక్షకులు.. సినీ విమర్శకుల నుండి అత్యుత్తమమైన రివ్యూలు రావడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. మెల్లమెల్లగా పెరిగిన పాజిటివ్ మౌత్ టాక్ వల్ల ఈ సినిమాను డిజాస్టర్ కాకుండా కాపాడుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేసేలా చేసింది.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 94 కోట్ల గ్రాస్ వసూళ్లతో విజయవంతమైన ట్రాక్ రికార్డును నమోదు చేసింది. భారతదేశంలో మొత్తం రూ. 60.25 కోట్ల నెట్ (రూ. 73 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించగా.. ఓవర్సీస్ (అంతర్జాతీయ మార్కెట్) లో 2.35 మిలియన్ డాలర్లు (రూ. 22 కోట్ల గ్రాస్) రాబట్టింది. మొదటి వారంలో కేవలం రూ. 11.50 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా.. రెండవ వారంలో ఏకంగా రూ. 21.25 కోట్లు.. మూడవ వారంలో రూ. 16.25 కోట్లు వసూలు చేయడం ద్వారా ఆరంభ వారం కంటే తర్వాత వారాల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించి అరుదైన మైలురాయిని చేరుకోవడం ఒక రికార్డు.
గతంలో వచ్చిన '12త్ ఫెయిల్' సినిమా తరహాలోనే ఈ చిత్రం కూడా ప్రారంభంలో తక్కువ వసూళ్లు సాధించినా... ఆ తర్వాత అద్భుతంగా పుంజుకోవడం ఆశ్చర్యపరిచింది. సాధారణంగా మొదటి వారంలోనే ఎక్కువ వసూళ్లు వచ్చి ఆ తర్వాత పడిపోయే రోజుల్లో రెండవ- మూడవ వారాల్లో మొదటి వారం కంటే ఎక్కువ వసూళ్లు సాధించడం సినీ పరిశ్రమలో అత్యంత అరుదైన దృశ్యంగా చెప్పవచ్చు. నసీరుద్దీన్ షా, దిల్జీత్ దొసాంజ్, వేదాంగ్ రైనా, శార్వరి వంటి నటీనటుల అద్భుత నటన `మై వాపస్ ఆవుంగా` చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచింది.
థియేటర్లలో ఏకంగా ఆరు వారాల పాటు దిగ్విజయంగా ప్రదర్శితమై దాదాపు రూ. 94 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని ముగించిన `మెయిన్ వాపస్ ఆవుంగా` ఒక అద్భుతమైన సక్సెస్ స్టోరీగా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ క్లాసిక్ డ్రామా ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. థియేటర్లలో సాధించిన ఈ అనూహ్య విజయం తర్వాత ఓటీటీ (OTT) లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.