హిట్ సిరీస్ ఫినాలే కోసం శైలేష్ అదిరిపోయే ప్లాన్
తెలుగు థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హిట్ ఫ్రాంచైజ్ ఇప్పుడు మరింత భారీ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది.;
తెలుగు థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హిట్ ఫ్రాంచైజ్ ఇప్పుడు మరింత భారీ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే మూడు భాగాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సిరీస్, మొత్తం ఏడు భాగాలుగా రూపుదిద్దుకుని చివరికి ఒక గ్రాండ్ ఫినాలేతో ముగియనుందని డైరెక్టర్ శైలేష్ కొలను అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా ఏడో భాగంలో ఇప్పటివరకు వచ్చిన అన్ని హీరోలు ఒకే కథలో కలుసుకుని, అవెంజర్స్ స్టైల్ లో కేసును సాల్వ్ చేయబోతున్నారనే సంకేతాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇప్పటికే హిట్ సిరీస్ నుంచి మూడు సినిమాలు
హిట్: ది ఫస్ట్ కేస్ట్ లో విశ్వక్ సేన్ తన గంభీరమైన నటనతో ఫ్రాంచైజ్‌కు బలమైన పునాది వేశారు. ఆ తర్వాతి భాగంలో అడివి శేష్ మరింత మానసిక ఉత్కంఠను జోడించి కథను విస్తరించారు. రీసెంట్ గా హిట్ 3లో నాని నటన, కథన శైలి హిట్ ఫ్రాంచైజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రతి భాగంలో వేర్వేరు పోలీస్ అధికారుల కథలను చూపిస్తూ, ఒకే యూనివర్స్‌లో కేసులు, సూచనలు, లింక్ చేస్తూ సాగుతున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కార్తీ హీరోగా హిట్4
హిట్3 క్లైమాక్స్ లో తమిళ స్టార్ హీరో కార్తీని ఫిక్స్ చూపించి హిట్4లో అతనే హీరో అని క్లూ ఇచ్చిన టీమ్, హిట్4తో ఫ్రాంచైజ్‌ను పాన్ ఇండడియా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భాషా హద్దులను దాటి, క్రైమ్ థ్రిల్లర్ కథనాన్ని మరింత విస్తృతంగా చూపించాలనే టార్గెట్ తోనే కార్తీని సెలెక్ట్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. హిట్4 తర్వాత మిగిలిన భాగాలు వరుసగా రాబోతున్నాయి. చివరికి ఏడో భాగంలో ఇప్పటివరకు వచ్చిన ఆరు మంది హీరోలు ఒకే కథలో భాగమవుతారని డైరెక్టర్ శైలేష్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ఏమో ఏమో ఇది మూవీతో శైలేష్ బిజీ
కాగా ప్రస్తుతం శైలేష్ కొలను, శ్రీకాంత్ తనయుడు మేక రోషన్‌తో ‘ఏమో ఏమో ఇది’ అనే ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే హిట్ 4 సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సమాచారం. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై నాని నిర్మాతగా నిర్మితమవుతున్న ఈ ఫ్రాంచైజ్, నిర్మాణ పరంగా కూడా మంచి స్థాయిలో కొనసాగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్రాంచైజ్‌లకు ఉన్న ఆదరణ పెరుగుతున్న వేళ, హిట్ సిరీస్ కొత్త ట్రెండ్‌కు నాంది పలికిందని చెప్పవచ్చు. ఒక్కో భాగంలో ఒక్కో కథ, ఒక్కో హీరో, తర్వాత ఒకే పెద్ద కథానికలో భాగమవుతుండటం ఈ సిరీస్ ప్రత్యేకత. ఇప్పుడు ఏడో భాగం కోసం వేసిన గ్రాండ్ ప్లాన్ చూస్తుంటే, తెలుగు సినిమాల్లోనే తొలిసారి ఈ స్థాయిలో మల్టీ-హీరో యూనివర్స్ ముగింపు చూడబోతున్నామన్న అంచనాలు పెరుగుతున్నాయి.
ఇక ముందు రానున్న భాగాల్లో మరిన్ని క్రాస్ రిఫరెన్సులు, పాత కేసులకు కొత్త లింకులు, పాత్రల మధ్య అనుబంధాలు బయటపడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా, హిట్ సిరీస్ ఒక సాధారణ క్రైమ్ థ్రిల్లర్ నుంచి ఒక విస్తృత సినీ ప్రపంచంగా మారబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.