కొరవడిన సమకాలీన కథలు..ఫ్యూచరిస్టిక్ బాటలో స్టార్ హీరోలు!

టాలీవుడ్ పాన్-ఇండియా రేంజ్‌లో విజయాలు సాధించడానికి ఫ్యూచరిస్టిక్ బాట ఎంచుకోవడం ఎంత ముఖ్యమో?

Update: 2026-07-21 15:30 GMT

ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో కథల ఎంపిక విషయంలో పెద్ద మార్పు కనిపిస్తోంది. స్టార్ హీరోలంతా రియాలిటీకి పూర్తిగా దూరంగా కేవలం భారీ బడ్జెట్ పీరియాడిక్ .. ఫ్యూచరిస్టిక్ కథల వైపే మొగ్గు చూపుతున్నారు. సమాజంలో నిత్యం జరిగే సాధారణ సమస్యలు .. వాస్తవ పరిస్థితులకు దూరంగా కల్పిత రాజ్యాలు .. సైన్స్ ఫిక్షన్ నేపథ్యాలతో చిత్రాలను తెరకెక్కించడంపైనే దర్శక, నిర్మాత‌లు ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నారు. ఈ ట్రెండ్‌కు తగినట్టే టాలీవుడ్‌లో రాబోతున్న పెద్ద చిత్రాలన్నీ దాదాపు ఇదే బాటలో సాగుతుండటం గమనార్హం.

బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన `కల్కి 2898 ఏడీ` వంటి చిత్రాల బాటలోనే మరికొన్ని భారీ ప్రాజెక్ట్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న `ఫౌజీ`, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న `రాకా` వంటి చిత్రాలు పీరియాడిక్ ... ఫ్యూచరిస్టిక్ జోనర్‌లోనే తెర‌కెక్కుతున్నాయి. తెలుగు సినిమా మార్కెట్ పాన్-ఇండియా స్థాయికి విస్తరించిన తర్వాత గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ తరహా భారీ విజువల్ వండర్స్‌ను ఎంచుకుంటున్నారు.

అయితే ఈ ఫ్యూచరిస్టిక్ , పీరియాడిక్ సినిమాల వ్యామోహంలో పడి టాలీవుడ్‌లో నేటి సమాజానికి అద్దం పట్టే సమకాలీన కథల కొరత తీవ్రంగా ఏర్పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మధ్యతరగతి జీవితాలు, రోజువారీ పోరాటాలు, రాజకీయ , సామాజిక అంశాల ఆధారంగా తెరకెక్కిన రియలిస్టిక్ డ్రామాలు ప్రేక్షకులను విశేషంగా అలరించేవి. కానీ నేడు స్టార్ హీరోల సినిమాలలో ఆ సహజమైన నేటితరం కథలు కనుమరుగైపోతుండటం తో ప్రేక్షకులు తమను తాము తెరపై చూసుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయి.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమను పరిశీలిస్తే అక్కడ పూర్తిగా భిన్నమైన ధోరణి కనిపిస్తోంది. హిందీ నటులు .. దర్శకులు కల్పిత ప్రపంచాలకంటే నేటి కరెంట్ ఇష్యూస్ , రాజకీయ అంశాలు , రియలిస్టిక్ కథలను బేస్ చేసుకుని ధైర్యంగా ప్రయోగాలు చేస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆలోచింపజేయడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటున్నాయి. బాలీవుడ్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ రియలిస్టిక్ సినిమాలకు ఇస్తోన్న‌ ప్రాధాన్యత టాలీవుడ్‌లో కాస్త వెనుకబడిందనే చెప్పాలి.

భారీ బడ్జెట్లు, గ్రాఫిక్స్ , భవిష్యత్తు కాలపు కల్పనలు ప్రేక్షకులకు తాత్కాలికంగా అద్భుతమైన దృశ్య అనుభూతిని పంచినప్పటికీ మనిషి భావోద్వేగాలతో ముడిపడిన సమకాలీన కథలు ఇచ్చే కనెక్షన్ వేరుగా ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు పూర్తిగా ఫ్యూచరిస్టిక్ .. పీరియాడిక్ చిత్రాల చుట్టూనే ప్రయాణిస్తే మధ్యతరగతి , వాస్తవ కథలను కోరుకునే ప్రేక్షకులు నిరాశ చెందే అవకాశం ఉంది. కమర్షియల్ హంగులతో పాటు నేటి సమాజంలోని నిజమైన సమస్యలను స్పృశించే సినిమాలు కూడా వస్తేనే పరిశ్రమ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవుతుంది.

టాలీవుడ్ పాన్-ఇండియా రేంజ్‌లో విజయాలు సాధించడానికి ఫ్యూచరిస్టిక్ బాట ఎంచుకోవడం ఎంత ముఖ్యమో? మనదైన నేటి సమాజపు కాంటెంపరరీ కథలను వెండితెరపై ఆవిష్కరించడం కూడా అంతే ముఖ్యం. భవిష్యత్తు ప్రయోగాలతో పాటు వాస్తవికతకు పెద్దపీట వేసే సమతుల్యతను సాధించినప్పుడే తెలుగు సినిమా పరిపూర్ణమైన వృద్ధిని సాధించగలదు.

Tags:    

Similar News