రామోజీతో చేయాల్సిన వాడు.. కోనతో!

Update: 2015-11-03 07:30 GMT
రాజ్ కిరణ్.. తొలి సినిమాతో హిట్టు కొట్టడమే కాదు, తనను నమ్మి పెట్టుబడి మీద నిర్మాతకు మూడు రెట్లు సంపాదించి  పెట్టిన దర్శకుడు. గత ఏడాది ‘గీతాంజలి’ సినిమాతో రాజ్ కిరణ్ దర్శకుడిగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి రెండో సినిమా ‘త్రిపుర’ కూడా మంచి అంచనాల మధ్య విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నాడు రాజ్ కిరణ్.

ప్రొజక్షన్ బాయ్‌ గా సినిమాల్లో ప్రస్థానం ఆరంభించి.. దర్శకుడిగా ఎదిగానంటున్నాడు రాజ్ కిరణ్. దాదాపు రెండు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నానని.. ఐతే పదేళ్ల కిందటే దర్శకుడవ్వాల్సిన తాను.. కాంప్రమైజ్ కాని మనస్త్తత్వం వల్లే ఇన్నేళ్లు ఎదురు చూడాల్సి వచ్చిందన్నాడు. 2004లో తాను దర్శకుడు కావాల్సిందని.. ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో తనకు దర్శకుడిగా అవకాశం కూడా లభించిందని.. ఐతే తన స్క్రిప్టును మార్చమన్నందుకు నొచ్చుకుని ఆ అవకాశాన్ని వదులుకున్నానని రాజ్ కిరణ్ చెప్పాడు.

ఆ తర్వాత దర్శకుడిగా మారడానికి చేసిన ప్రయత్నాలు అంత సులువుగా ఫలించలేదేని.. చివరికి ‘గీతాంజలి’ కథతో పీవీపీ సంస్థను కలిశానని.. వాళ్లు వెంటనే సినిమా చేయడం కుదరక, కోన వెంకట్ కు పరిచయం చేశారని.. కోన తన కథలో దమ్ముందని గ్రహించి స్వయంగా నిర్మాతగా మారి, స్క్రీన్ ప్లే సహకారం కూడా అందించి ‘గీతాంజలి’ సినిమా పట్టాలెక్కడానికి కారణమయ్యారని చెప్పాడు రాజ్ కిరణ్. ‘త్రిపుర’ సినిమా కూడా గీతాంజలి తరహాలోనే పెద్ద హిట్టవుతుందని అతను ధీమాగా చెప్పాడు.
Tags:    

Similar News