మెగాస్టార్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టాడా?
కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొంత కాలంగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.;
కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొంత కాలంగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. తమ ఏజ్‌కు తగ్గ పాత్రలని మాత్రమే ఎంచుకుంటూ కొత్త తరహా యాక్షన్ ఎంటర్ టైనర్‌లని ప్రేక్షకులకు అందిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీ `కబాలి`తో ఈ ఫార్ములా మూవీస్‌కి శ్రీకారం చుట్టారు. ఇందులో తన ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్‌లో నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే భారీ బ్లాక్ బస్టర్‌ని మాత్రం `జైలర్`తో అందుకున్నారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో రూ.600 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సూపర్ స్టార్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ తరువాత అదే పంథాని కొనసాగిస్తూ రజనీ సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం `జైలర్ 2`తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. టైగర్ ముత్తువేళ్ పాండ్యన్‌గా రజనీ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ 12న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌లతో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక అతిథి పాత్రలో మెరవబోతున్నారు.
ఇక ఇదే తరహాలో సీనియర్ స్టార్ కమల్ హాసన్ కూడా సినిమాలు చేస్తున్నాడు. `విక్రమ్` మూవీతో తన ఏజ్‌కి తగ్గ పాత్రలు, సినిమాలని ఎంచుకుంటూ వస్తున్నారు. ఇండియన్ 2, థగ్ లైఫ్ మూవీస్ చేసినా పెద్దగా ఫలితం లేకపోవడంతో తన 237వ ప్రాజెక్ట్‌ని ఫైట్ మాస్టర్స్ అన్బు అరివుల డైరెక్షన్‌లో చేస్తున్నాడు. వీళ్ల తరహాలో మన సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్స్, సినిమాలు చేయట్లేదనే కామెంట్‌లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ `భగవంత్ కేసరి` సినిమాతో ఆ లోటుని తీర్చారు.
ఇప్పుడు మెగాస్టార్ కూడా అదే బాటలో పయనించడం మొదలు పెట్టారు. ఈ సంక్రాంతికి చిరు చేసిన మూవీ `మన శంకరవరప్రసాద్ గారు`తో కొత్త తరహా సినిమాలకు, కెరీర్ పరంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. `భోళా శంకర్` మూవీ టైమ్‌లో చిరు అవే డ్యాన్స్‌లు, అదే హీరో టైమ్ క్యారెక్టర్స్ అంటూ విమర్శలొచ్చాయి. వాటన్నింటికీ సమాధానంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన చిరు `మన శంకరవరప్రసాద్‌గారు`తో కొత్త తరహా సినిమాలకు నాంది పలికారు.
సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డు స్థాయి వసూళ్ల దిశగా పయనిస్తోంది. ఇంతటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత మెగాస్టార్ మరో అడుగు ముందుకేసి మరో సినిమా చేస్తున్నాడు. బాబి డైరెక్షన్‌లో చిరంజీవి ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరుకు జోడీగా ప్రియమణి తొలిసారి నటిస్తోంది. అంతే కాకుండా ఇందులో చిరు తన ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్‌లో కనిపిస్తారట. తనకు కూతురిగా కృతిశెట్టి నటిస్తోందని తెలిసింది. ఇదే నిజమైతే మెగాస్టార్ తనపై గతంలో వచ్చిన విమర్శలకు గట్టి సమాధానం చెప్పడానికి రెడీ అవుతున్నట్టేనని అభిమానులు అంటున్నారు.