పద్మావతి భవిత్యం వాళ్ల చేతుల్లో..

Update: 2017-11-29 11:43 GMT
ఈ మధ్య కాలంలో ‘పద్మావతి’ సినిమా మీద వచ్చినన్ని వివాదాలు మరే సినిమా మీదా రాలేదనే చెప్పాలి. ఇంతకుముందు ‘ఉడ్తా పంజాబ్’ లాంటి సినిమాల మీద కూడా వివాదాలు చెలరేగాయి కానీ.. అవి సెన్సార్ చుట్టూ తిరిగాయి. కానీ ‘పద్మావతి’కి వ్యతిరేకంగా జరుగుతున్నంత తీవ్ర స్థాయిలో ఏ సినిమా మీదా ఆందోళనలు చోటు చేసుకోలేదు. రాష్ట్రాలకు రాష్ట్రాలు ఈ సినిమాను నిషేధించేస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సెన్సార్ బోర్డు దగ్గర కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ చిత్రాన్ని డిసెంబరు 1 నుంచి వాయిదా వేసేయాల్సి వచ్చింది. ఐతే వివాదం సుప్రీం కోర్టుకు చేరడం.. అక్కడ సినిమాకు అనుకూలంగా తీర్పు రావడంతో ‘పద్మావతి’ టీంకు కొంత ఊరట లభించింది.

ఇప్పుడీ సినిమా వివాదం పార్లమెంటరీ ప్యానెల్ వద్దకు చేరింది. ఆ ప్యానెల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ సినిమా విడుదలకు నోచుకుంటుంది. ‘పద్మావతి’ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీతో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతినిధులు.. సెన్సార్‌ బోర్డు అధికారులు పార్లమెంటరీ ప్యానెల్‌ ఎదుట హాజరుకానున్నారు. చిత్ర వివాదంపై బన్సాలీతో పాటు ఇతరుల వాదనల్ని ప్యానెల్‌ విననుంది. గురువారం ఈ వివాదంపై చర్చ జరగనుంది. గతంలోనే భన్సాలీ ఈ చిత్రంలో రాణి పద్మావతి గురించి అభ్యంతరకరంగా ఏమీ చూపించలేదని వివరణ ఇచ్చుకున్నప్పటికీ వివాదాలు మాత్రం ఆగలేదు. ఇప్పటికే ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్.. బీహార్ రాష్ట్రాలు నిషేధించాయి. రాజస్థాన్.. జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాలు కూడా అదే బాటలో సాగొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి పార్లమెంటరీ ప్యానెల్ ఈ సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News