లెజెండ‌రీల అడుగు జాడ‌ల్లో పాన్ ఇండియా స్టార్

Update: 2021-07-24 14:30 GMT
న‌ట‌సార్వ‌భౌమ స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు,.. లెజెండ‌రీ   అక్కినేని నాగేశ్వ‌ర‌రావు.. సూప‌ర్ స్టార్ కృష్ణ అసాధార‌ణ కెరీర్ జ‌ర్నీ గురించి వారు  న‌టించిన సినిమాల జాబితా గురించి త‌ర‌చి చూస్తే వారి క‌ఠోర శ్ర‌మ అర్థ‌మ‌వుతుంది. కొన్ని వంద‌ల చిత్రాల్లో న‌టించి దిగ్గ‌జ స్టార్లు అయ్యారు. మ‌రి వారంద‌రికీ వంద‌ల చిత్రాల్లో న‌టించ‌డం ఎలా సాధ్య‌మైంది అంటే? ఎంతో శ్ర‌మించారు కాబ‌ట్టే అన్ని చిత్రాల్లో న‌టించ‌గ‌లిగారు.

అప్ప‌ట్లో  ఆ ముగ్గురు న‌టులు ఒకేసారి నాలుగైదు చిత్రాల్లో న‌టించేవారు. ఒక సినిమా షూటింగ్ చెన్నైలో జ‌రుగుతుంటే..మ‌రో సినిమా హైద‌రాబాద్ లో జ‌రిగినా అప్ప‌టిక‌ప్పుడు ప్లైట్ లో వ‌చ్చి త‌మ స‌న్నివేశాల్లో న‌టించి వెళ్లిపోయేవారు. దూరాభారం అనే లెక్క‌లకు ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఎప్పుడూ దూరంగానే ఉండేవారు. రేయింబ‌వ‌ళ్లు సినిమా కోస‌మే ప‌నిచేసేవారు. సినిమా కోస‌మే త‌పించేవారు. అందుకే వాళ్ల సినిమా కెరీర్ లో అన్ని అవార్డులు..రివార్డులు... టాలీవుడ్  చ‌రిత్ర పుస్త‌కాల్లో వాళ్ల‌కంటూ కొన్ని పేజీలు ఉన్నాయి.

ఆ త‌ర్వాతి కాలంలో శోభ‌న్ బాబు- కృష్ణంరాజు మెగాస్టార్ చిరంజీవి,.. బాల‌కృష్ణ ,.. వెంక‌టేష్‌,.. నాగార్జున, .. ముర‌ళీ మోహ‌న్ లాంటి న‌టులు కొంత వ‌ర‌కూ వాళ్ల‌ను  అందుకునే ప్ర‌య‌త్నం చేసారు.  మ‌రి ఇప్ప‌టి స్టార్లకు అది సాధ్య‌మేనా? అంటే ఎంత మాత్రం  కాద‌నే చెప్పాలి.

ఇప్ప‌టి అగ్ర  హీరోలంతా ఒక సినిమా పూర్తై రిలీజ్ అయితే త‌ప్ప త‌ర్వాతి సినిమాకు క‌మిట్  అవ్వ‌రు. ఆ సినిమా ఫ‌లితాన్ని బ‌ట్టి వంద ర‌కాల లెక్క‌లేసుకుని త‌దుప‌రి ప్రాజెక్ట్ కు సంత‌కం చేస్తారు. అయితే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మాత్రం మిగ‌తా హీరోలంద‌రికంటే  స్పీడ్ పెంచిన‌ట్లే క‌నిపిస్తోంది. దిగ్గ‌జ న‌టులు రేర్ ఫీట్ ని అందుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు అనిపిస్తోంది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ వ‌రుస‌గా  మూడు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్`- ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో  `స‌లార్`- బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌కత్వంలో `ఆదిపురుష్` లోనూ న‌టిస్తున్నారు.  మూడు చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. అలాగే  నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సై-ఫై థ్రిల్ల‌ర్ ని ప‌ట్టాలెక్కించ‌డానికి డార్లింగ్ రెడీ అవుతున్నారు.

మ‌రి ఒక్క‌సారిగా ప్ర‌భాస్ ఇలా వేగం పెంచ‌డానికి కార‌ణం ఏమై ఉంటుంది? ఆయ‌న్ని  వెనుక నుండి ఎవ‌రైనా గైడ్ చేస్తున్నారా?  అన్న‌ది క్లారిటీ లేదు గానీ పెదనాన్న కృష్ణం రాజు స‌ల‌హా మేర‌కు ఇలా షైన్ అవుతున్నారా? అన్న సందేహం రాక‌మాన‌దు. 
Tags:    

Similar News