టాలీవుడ్ వైపు చూస్తున్న ఇతర ఇండస్ట్రీల స్టార్ డైరెక్టర్స్..!

Update: 2021-02-19 04:30 GMT
టాలీవుడ్ హీరోలు ఒకప్పుడు ద్విభాషా చిత్రం చేస్తేనే గొప్పగా చెప్పుకొనే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు క్రేజ్ తో సంబంధం లేకుండా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. రాజమౌళి 'బాహుబలి'తో ఒక్కసారి తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లిపోతే.. ఇప్పుడు మిగతా వారు ఆ క్రేజ్ తో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ఇండస్ట్రీల స్టార్ డైరెక్టర్స్ కూడా తెలుగు హీరోలతో జత కట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇటీవల తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో అలరిస్తూ వచ్చిన శంకర్.. ఫస్ట్ టైం డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నాడు. తాజాగా మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఉస్తాద్ రామ్ పోతినేనితో సినిమా ప్రకటించాడు. తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.

ఇక బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'ఆదిపురుష్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. రామాయణం నేపథ్యంలో 3డీ టెక్నాలజీలో భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. ఇదే క్రమంలో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' తర్వాత ప్రభాస్ తో 'సలార్' అనే సినిమా చేస్తున్నాడు. అలానే 'వార్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ - ప్రభాస్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

'దంగల్' ఫేమ్ నితీష్ తివారి - 'మామ్' ఫేమ్ రవి ఉద్యవార్ వంటి వారు తెలుగు హీరోలతో 'రామాయణం' సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో పరభాష స్టార్ డైరెక్టర్లతో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్సమెంట్ ఉండబోతోందని తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ పాన్ ఇండియా లెవల్ లో పాకిపోవడంతో అందరి చూపు ఇప్పుడు టాలీవుడ్ పైనే ఉందని అర్థం అవుతోంది.


Tags:    

Similar News