మొన్న అనిల్.. నేడు క్రిష్

ఇటీవలే ‘మన శంకర వరప్రసాద్ గారు’తో భారీ విజయాన్నందుకున్న అనిల్ రావిపూడి నుంచి రాబోయే కొత్త చిత్రం గురించి మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరగ్గా.. ఆ దర్శకుడు స్పందించాడు.;

Update: 2026-02-14 14:30 GMT

స్టార్ డైరెక్టర్ల నుంచి ఒక సినిమా రాగానే.. ఇంకో సినిమా  గురించి ఊహాగానాలు మొదలైపోతాయి. కొందరు తెలిసిన సమాచారాలకు కొంచెం మసాలా అద్దితే.. కొందరు అబద్ధపు వార్తల్ని పుట్టించి నిజాలుగా ప్రచారం చేస్తుంటారు. దర్శకుల్లో కొందరు వీటిని పట్టించుకుంటారు. కొందరు ఖండిస్తారు. ఇటీవలే ‘మన శంకర వరప్రసాద్ గారు’తో భారీ విజయాన్నందుకున్న అనిల్ రావిపూడి నుంచి రాబోయే కొత్త చిత్రం గురించి మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరగ్గా.. ఆ దర్శకుడు స్పందించాడు. ఈ ఫ్లోలో యాక్షన్, కట్ కూడా చెప్పేస్తారా అంటూ సెటైర్ వేసిన అనిల్.. తనే స్వయంగా కొత్త సినిమా వివరాలు ప్రకటించే వరకు కాస్త ఆగమన్నాడు. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ క్రిష్ సైతం తన కొత్త సినిమా గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు.

ఏడుగురు హీరోయిన్లను పెట్టి క్రిష్ ఒక సినిమా తీయబోతున్నాడని.. అది ట్రెక్కింగ్ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ అని ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. తన ప్రతి చిత్రంలోనూ కథానాయికకు బలమైన పాత్రలు ఇచ్చే క్రిష్.. ఏడుగురు హీరోయిన్లతో సినిమా చేస్తున్నాడనగానే చాలామంది ఎగ్జైట్ అయ్యారు. కానీ ఈ ప్రచారం నిజం కాదని క్రిష్ తేల్చేశాడు. ‘‘ఏడుగురు హీరోయిన్లు, ట్రెక్కింగ్ అడ్వెంచర్.. ఐడియా బాగుంది. కానీ అది నిజం కాదు. సోషల్ మీడియాలో రూపొందిన మరో స్క్రిప్టు’’ అంటూ సెటైరికల్‌గా స్పందించాడు క్రిష్. తన కొత్త సినిమా వివరాలను త్వరలోనే తనే అధికారికంగా ప్రకటిస్తానని క్రిష్ తెలిపాడు.

ఒకప్పుడు గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి గొప్ప సినిమాలు అందించిన క్రిష్.. చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు, హరిహర వీరమల్లు, ఘాటి చిత్రాలు ఆయనకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ముఖ్యంగా గత ఏడాది ‘ఘాటి’తో పెద్ద షాకే తిన్నాడు క్రిష్. మరి కొత్త సినిమాతో అయినా పుంజుకుంటాడేమో చూడాలి. ఎప్పట్లాగే సొంత బేనర్లోనే తన కొత్త సినిమాను క్రిష్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News