మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో కొత్త బ్లాక్ పాంథర్‌!

మూడో భాగంలో ట్రిబ్యూట్ రూపంలో కాకుండా ప్రముఖ నటుడు డేవిడ్ జాన్సన్ బ్లాక్ పాంథర్ పాత్రను పోషిస్తారని చిత్ర బృందం స్పష్టం చేసింది.

Update: 2026-07-26 08:06 GMT

హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మన్ అకాల మరణం `బ్లాక్ పాంథర్` ఫ్రాంచైజీపై .. యావత్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) పై అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. 2018లో విడుదలైన `బ్లాక్ పాంథర్` చిత్రం కేవలం ఒక సూపర్ హీరో సినిమాగా మాత్రమే కాకుండా.. పాప్ కల్చర్‌లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోయింది. టైటిల్ పాత్రలో చాడ్విక్ బోస్‌మన్ చూపిన అభినయం, ఆయన వెన‌కనుకున్న `వకాండా ఫరెవర్` నినాదం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది అభిమానులకు గొప్ప స్ఫూర్తినిచ్చాయి. అయితే 2020లో చాడ్విక్ బోస‌మ‌న్ క్యాన్సర్‌తో మరణించడంతో ఆ పాత్రను .. తదుపరి కథను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చిత్ర యూనిట్‌కు స‌వాలుగా మారింది.

బోస‌మ‌న్ మరణం తర్వాత మేకర్స్ కథా దిశను పూర్తిగా మార్చాల్సి వచ్చింది. ప్రణాళికాబద్ధమైన సీక్వెల్‌లో చాడ్విక్ బోస్‌మనే ప్రధాన పాత్రలో కొనసాగాల్సి ఉండగా.. ఆయన నిష్క్రమణతో ఆ పాత్రను వేరే నటుడితో భర్తీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో `బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్` (2022) చిత్రంలో కథను పూర్తిగా మార్చి లెటిషియా రైట్ పోషించిన శురి పాత్ర ద్వారా ఆ బాధ్యతను మోపాల్సి వచ్చింది. చాడ్విక్ లేని లోటును ఆ సినిమాలోని ప్రతీ ఫ్రేమ్‌లోనూ ఒక నివాళిలా మలిచారు.

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన కుమారుడిగా మరో కొత్త పాత్ర (డేవిడ్ జాన్సన్) ద్వారా ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్లు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మార్వెల్ స్టూడియోస్ `బ్లాక్ పాంథర్ 3` కోసం కొత్త నటుడిని అధికారికంగా ప్రకటించింది. శాన్ డియేగో కామిక్-కాన్ వేదికగా ఆస్కార్ విజేత అయిన దర్శకుడు రయాన్ కూగ్లర్ ఈ విషయాన్ని వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మూడో భాగంలో ట్రిబ్యూట్ రూపంలో కాకుండా ప్రముఖ నటుడు డేవిడ్ జాన్సన్ బ్లాక్ పాంథర్ పాత్రను పోషిస్తారని చిత్ర బృందం స్పష్టం చేసింది. `బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్` చిత్రంలో చిన్ననాటి పాత్రగా పరిచయమైన ప్రిన్స్ టెచల్లా II (టెచల్లా కుమారుడు) పాత్రలో డేవిడ్ జాన్సన్ కనిపించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని డిసెంబర్ 15 2028న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ ప్రాజెక్ట్‌లో రయాన్ కూగ్లర్‌తో పాటు లెటిషియా రైట్ (శురి పాత్రలో), విన్‌స్టన్ డ్యూక్ (ఎంబాకు పాత్రలో) కూడా తిరిగి నటిస్తుండటం విశేషం. ఈ క్యాస్టింగ్ ప్రకటనపై సోషల్ మీడియాలో అభిమానుల నుంచి మిశ్రమమైనా సానుకూల స్పందన వస్తోంది. చాడ్విక్ బోస్‌మన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయినా? ఆయన వారసత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే సరైన నటుడిని ఎంచుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. డేవిడ్ జాన్సన్ నటనపై ఉన్న నమ్మకంతో పాటు రయాన్ కూగ్లర్ టేకింగ్ మీద ఉన్న అంచనాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి కొత్త బ్లాక్ పాంథర్‌గా డేవిడ్ జాన్సన్ ఏ విధంగా మెప్పిస్తారనేది చూడాలి.

Tags:    

Similar News