గతంలో అల్లు అర్జున్, రామ్ చరణ్, నేను కూడా..: మహేష్ బాబు

ఈ సినిమాను ఇంత అద్భుతంగా తెరకెక్కించినందుకు దర్శకుడు అజయ్ భూపతికి మహేష్ బాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Update: 2026-07-26 08:06 GMT

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, ఈ సినిమాపై మహేష్ బాబు ఒక స్పెషల్ వీడియో ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. తన అన్న కొడుకు ఇండస్ట్రీలోకి రావడం తమ కుటుంబం మొత్తానికి సంతోషాన్ని ఇస్తోందని ఆయన తెలిపారు.

మహేష్ బాబు తన వీడియోలో, జయకృష్ణ ఎంట్రీ పట్ల తామంతా చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నామని చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్నీ తనకు చాలా నచ్చాయని పేర్కొన్నారు. హీరో జయకృష్ణ, హీరోయిన్ రాషా థడాని ఇద్దరూ స్క్రీన్ పై చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నారని, వాళ్ళిద్దరికీ ఇది ఒక మంచి లాంచ్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సినిమాను ఇంత అద్భుతంగా తెరకెక్కించినందుకు దర్శకుడు అజయ్ భూపతికి మహేష్ బాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

సినిమాలోని ఎమోషన్ ను, యాక్టర్స్ ను చాలా బాగా ప్రెజెంట్ చేశారని డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరూ ఎంతో కష్టపడ్డారని, వారి శ్రమ సినిమాలో కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచిందని మహేష్ బాబు అన్నారు. అలివేలు అనే పాట తనకు బాగా నచ్చిందని, మ్యూజిక్ ఇప్పటికే పెద్ద హిట్ అయిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

జూలై 30న విడుదల కానున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించడం కొత్తవారికి ఒక అదృష్టమని ఆయన పేర్కొన్నారు. గతంలో అల్లు అర్జున్, రామ్ చరణ్, అలాగే తాను కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్ ద్వారానే పరిచయమయ్యామని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు జయకృష్ణ, రాషా కూడా అదే బ్యానర్ లో, అశ్వినీ దత్, జెమినీ కిరణ్ లాంటి అగ్ర నిర్మాతల చేతుల మీదుగా పరిచయం కావడం చాలా స్పెషల్ అని అన్నారు.

కచ్చితంగా ఈ సినిమా ఒక మంచి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చివరిగా తన అభిమానులు, నాన్న గారి అభిమానులు అందరూ జయకృష్ణను, రాషాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. జూలై 30న విడుదల కానున్న శ్రీనివాస మంగాపురం టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ మహేష్ బాబు తన సందేశాన్ని ముగించారు. ఈ వీడియోతో సినిమాపై బజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక జయకృష్ణ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News