12 ఏళ్ల ప్రయాణంలో ఇప్పుడిప్పుడే స్వేచ్ఛగా!
ప్రస్తుతం కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `టాక్సిక్` తో పాటు, `బేబీ డో డై డో` అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. వీటి నిర్మాణంలోనూ అమ్మడు భాగస్వామిగా ఉన్నారు.
బాలీవుడ్ లో హ్యూమాఖురేషీ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో వైవిథ్యమైన పాత్రలు పోషించి నటిగా తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటిగా గుర్తింపు దక్కించుకున్నారు. కొత్త తరం నటీమణులు ఎంత మంది పోటీగా వచ్చినా? వాళ్లెవ్వరు తనకేమాత్రం పోటీ కాదని ఎప్పికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. కొంత కాలంగా కథల విషయంలో మరింత సెలక్టివ్ గా ఉంటున్నారు. మనసుకు నచ్చితే తప్ప పారితోషికం కోసం సినిమాలు చేయడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా తన ప్రయాణాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కాలం మారుతున్న కొద్దీ విజయానికి సంబంధించిన నిర్వచనం కూడా మారిందన్నారు. ఇతరుల అంచనాలకు తలవంచకుండా తనకు నచ్చిన పాత్రలను ఎంచుకోవడమే అసలైన విజయమని పేర్కొన్నారు. నటీమణులను కొన్ని ప్రత్యేకమైన పాత్రలకే పరిమితం చేసే (టైప్‌కాస్ట్) ధోరణిపై హ్యూమా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనని ఒకే బాక్స్‌లో బంధించడం అస్సలు నచ్చదని.. నటిగా తాను చేయాల్సింది ఎంతో ఉందని ..ఇతరుల ఆలోచనల కోసమే తన పరిధులను కుదించుకోలేనని తేల్చిచెప్పారు. 12 ఏళ్ల ప్రయాణంలో ఇప్పుడిప్పుడే ఎక్కువగా మనసుకు నచ్చిన పాత్రలు పోషిస్తున్నానని..నటిగా తనకు మరింత స్వేచ్ఛ దొరుకుతుందన్నారు.
ప్రస్తుతం కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `టాక్సిక్` తో పాటు, `బేబీ డో డై డో` అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. వీటి నిర్మాణంలోనూ అమ్మడు భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్భంగా `టాక్సిక్` గురించి మాట్లాడారు. `టాక్సిక్` సినిమా విభిన్నమైన ప్రపంచమని.. అందులో పని చేయడం అద్భుతమైన అను భూతినిచ్చిందని పేర్కొన్నారు. కెరీర్ ఆరంభంలో కేవలం పేరు ప్రఖ్యాతులు, పాపులారిటీ సాధించడమే లక్ష్యంగా ఉండేదని కానీ ఇప్పుడు మన సుకు నచ్చిన వ్యక్తులతో పని చేయడం, నలగని పాత్రలను ధైర్యంగా తిరస్కరించగలగడమే నిజమైన సక్సెస్ అని హ్యూమా అభిప్రాయపడ్డారు. ఒకే సంవత్సరంలో మహిళా రాజకీయాలపై బలమైన పాత్ర చేయడం, మరోవైపు మాస్ సాంగ్స్‌లో కనిపించడం ఎంతో గర్వంగానూ ఉందన్నారు.
కెరీర్‌లో విభిన్న తరహా చిత్రాలతో అలరించిన హ్యూమాకు భవిష్యత్తులో మంచి రొమాంటిక్ ..కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయాలనే బలమైన కోరిక ఇంకా మిగిలే ఉందన్నారు. ఎవరైనా అలాంటి అవకాశం ఇస్తే తనదైన శైలిలో విభిన్నంగా ఆ పాత్రను పండించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.`గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్`, `బద్లాపూర్`, `టార్లా`, `మహారాణి`, `మోనికా ఓ మై డార్లింగ్` వంటి విభిన్న చిత్రాలతో సత్తా చాటుకున్న హ్యూమా ఖురేషి.. భవిష్యత్తులోనూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చే పాత్రలనే ఎంచుకుంటానని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.