అటెన్షన్ సీకర్ అంటూ బ్రహ్మాజీపై నరేష్ పంచులు!
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, డైరెక్టర్ అజయ్ భూపతితో తనకు ఎదురైన తొలి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురం సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తదానీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా, డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించారు. జెమినీ కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు సీ. అశ్వినీదత్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన రిలీజ్ ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా నటుడు వీకే నరేష్ చేసిన ఫన్నీ కామెంట్స్ ఈవెంట్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, డైరెక్టర్ అజయ్ భూపతితో తనకు ఎదురైన తొలి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రహ్మాజీ చేసిన అల్లరి కారణంగానే తాను మొదటిసారి అజయ్ భూపతి చేత తిట్లు తినాల్సి వచ్చిందని నవ్వుతూ చెప్పారు. ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉండాలా లేదా అన్నది తనకు తెలియదని, కానీ తమకు మాత్రం అలాంటి వ్యక్తులు ఉండటం అదృష్టమేనని వ్యాఖ్యానించారు. నరేష్ మాటలు విని బ్రహ్మాజీ స్టేజ్ దిగి వెళ్లిపోబోతుంటే, మీకు పని ఉంటే వెళ్లిపోవచ్చు.. కానీ వెళ్లడానికి నన్ను కారణంగా చూపించొద్దంటూ చమత్కరించడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లువెత్తాయి. నరేష్ కామెంట్స్ కు బ్రహ్మాజీ కూడా చిరునవ్వుతో స్పందించడంతో వేదికపై హాస్య వాతావరణం నెలకొంది.
అంతటితో ఆగకుండా బ్రహ్మాజీ స్వభావాన్ని కూడా నరేష్ తనదైన శైలిలో వర్ణించారు. ఆయన ఎక్కడ ఉన్నా అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే వ్యక్తి అని, నిజమైన అటెన్షన్ సీకర్ అంటూ సరదాగా పేర్కొన్నారు. మొదట బ్రహ్మాజీ మాట్లాడటం ప్రారంభించినప్పుడు చాలా సీరియస్‌గా, పెద్దరికం వచ్చిందేమో అనిపించిందని, కానీ మాట్లాడేకొద్దీ ఆయనలోని పాత కుర్రతనం ఏమాత్రం తగ్గలేదని వ్యాఖ్యానించారు.
తెలుగులో ఉండే చింత చచ్చినా పులుపు చావదు అనే సామెతను ఉదహరిస్తూ బ్రహ్మాజీని పోల్చడం మరోసారి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. నరేష్ చేసిన ఈ కామెంట్స్ పూర్తిగా ఫన్నీ యాంగిల్ లోనే సాగగా, బ్రహ్మాజీతో నరేష్ కు ఉన్న స్నేహాన్ని కూడా అవి ప్రతిబింబించాయి. మొత్తంగా సినిమా రిలీజ్ కు ముందు నిర్వహించిన ఈ ప్రెస్ మీట్‌లో ప్రచారానికి తోడు ఎంటర్టైన్మెంట్ కూడా కలిసివచ్చింది. చిత్ర యూనిట్ మధ్య కనిపించిన ఆత్మీయత, ఫన్నీ మూమెంట్స్ సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారుతున్నాయి.