హీరోల దెబ్బ‌కు మ‌రో రెండు నెల‌లు ఖాళీ

Update: 2020-06-20 05:14 GMT
ఇంకేం ఉంది.. షూటింగుల‌కు అనుమ‌తులు వ‌చ్చేశాయ్.. సెట్స్ కెళ్లిపోవ‌డ‌మే అనుకున్నారంతా. కానీ సీన్ చూస్తుంటే అలా లేదు. ఇన్నాళ్లు నేడు రేపు అంటూ తాత్సారం చేశారు హీరోలు. ప్ర‌స్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో మ‌హ‌మ్మారీ కుంప‌టి చూస్తుంటే ఇప్పుడే సెట్స్ కెళ్లాలంటే క‌ష్ట‌మేన‌న్న క్లారిటీకి వ‌చ్చేశారు మ‌న హీరోలంతా. దీంతో సెట్స్ కెళ్లే వీల్లేకుండా పోయింద‌ని చెబుతున్నారు. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింది. కార్మికుల‌ ఉపాధి పోయింది. తిండికి లేక న‌క‌న‌క‌లాడుతున్నారు. క‌నీసం ఇక‌నైనా షూటింగులు మొద‌లైపోతే క‌నీస ఉపాధి ల‌భిస్తుంద‌నే ఆశించారు. కానీ ఇప్ప‌ట్లో అది కుదిరేట్టు లేదు. మ‌రో రెండు నెల‌లు ప‌స్తులు త‌ప్ప‌దేమో! అన్న ఆందోళ‌న క‌నిపిస్తోంది.

మూడు నెల‌లుగా లాక్ డౌన్ వ‌ల్ల ఉపాధి లేదు. టాలీవుడ్ తారలు.. సాంకేతిక నిపుణులు .. రోజువారీ వేతన సినీ కార్మికులందరూ నిరుద్యోగులుగా ఉన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి టాలీవుడ్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని.. అప్ప‌టివ‌ర‌కూ షూటింగుల్ని ప్రారంభించ‌లేమ‌ని క్లారిటీకి వ‌చ్చేశార‌ట‌. జూలైలో క‌ష్టమేన‌ని మీడియం బ‌డ్జెట్ స‌హా భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు భావిస్తున్నార‌ట‌. దీంతో మ‌రోసారి షూటింగుల‌కు మ‌రో నెల బ్రేక్ ప‌డిపోయిన‌ట్టేన‌ని అర్థ‌మ‌వుతోంది.

రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్  ఆర్.ఆర్.ఆర్.. చిరంజీవి  ఆచార్య.. పవన్ కళ్యాణ్ - వకీల్ సాబ్.. ప్రభాస్ 20.. .. నాగార్జున -వైల్డ్ డాగ్.. అల్లు అర్జున్ పుష్ప వీళ్లంతా ఇప్ప‌ట్లో సెట్స్ కి వెళ్ల‌రు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలివి. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో కానీ చిత్రీక‌ర‌ణ‌ల‌కు వెళ్లేందుకు వీళ్లెవ‌రూ సిద్ధంగా లేర‌ట‌.

పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ పాన్-ఇండియా మూవీ ఫైట‌ర్.. నాగ చైతన్య - సాయి పల్లవి- క‌మ్ముల `లవ్ స్టోరీ`.. రానా దగ్గుబాటి - సాయి పల్లవి -విరాటా పర్వం.. గోపీచంద్ - తమన్నా సీటీమార్.. రవి తేజ -గోపిచంద్ మ‌లినేని క్రాక్ .. మరికొన్ని సినిమాలు ఆగస్టు లో చిత్రీక‌ర‌ణ‌ల‌కు వెళ‌తాయిట‌. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి ఇచ్చినప్పటికీ.. క‌రోనావైరస్ భయంతో అగ్రశ్రేణి హీరోలు ఎవ‌రూ సెట్స్ కి వ‌చ్చేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఈ డైల‌మా త‌ప్ప‌డం లేద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News