పాత ఫోన్ కు కొత్త ఐఫోన్ కవర్.. మనోజ్ సజెషన్ ఏంటంటే?

ఎప్పుడూ అభిమానులతో సందడి చేసే టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి తన మంచి ఆలోచనతో యూత్ మనసులు గెలుచుకున్నారు.;

Update: 2026-02-28 17:50 GMT

ఎప్పుడూ అభిమానులతో సందడి చేసే టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరోసారి తన మంచి ఆలోచనతో యూత్ మనసులు గెలుచుకున్నారు. గ్లామర్, లగ్జరీ ఐటమ్స్ విజయానికి సింబల్స్ కాదని, నిజమైన గౌరవం వర్క్ తో మాత్రమే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. తాజాగా గీతం యూనివర్సిటీ నిర్వహించిన ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన మనోజ్ విద్యార్థులతో ఓపెన్‌ గా మాట్లాడారు.

ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన మెసేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. "ఇతరుల మెప్పు కోసం అప్పులు చేయొద్దు.. ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకోండి" అంటూ యూత్ కు సజెషన్ ఇచ్చారు. అంతే కాదు.. మాటలకే పరిమితం కాకుండా లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపించారు. తన వద్ద ఉన్న పాత ఐఫోన్‌ కు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కవర్ వేసుకుని వాడుతున్నట్లు చూపించారు.

బయట కనిపించేది అసలు నిజం కాదని పరోక్షంగా తెలిపారు. ఖరీదైన వస్తువులు వాడితేనే గౌరవం వస్తుందనే భావన తప్పని చెప్పారు. "మన విలువ మన పని, మన వ్యక్తిత్వం వల్ల పెరుగుతుంది. గాడ్జెట్లు, బ్రాండ్లు వల్ల కాదు. ఫ్యాషన్ కోసం అప్పులు చేయడం జీవితాన్ని కష్టాల్లోకి నెడుతుంది" అని ఆయన చెప్పిన మాటలను విద్యార్థులు చప్పట్లతో స్వాగతించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే, మంచు మనోజ్ ప్రస్తుతం పలు డిఫరెంట్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల బైరవం, మిరాయ్ వంటి చిత్రాల తర్వాత ఆయన మరో పీరియాడికల్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డేవిడ్ రెడ్డి పేరుతో రూపొందుతున్న ఆ చిత్రం స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతోంది.

1897 నుంచి 1922 మధ్యకాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడి నేపథ్యాన్ని తీసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ మూవీకి హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో పాత్ర ఫిక్షనల్ అని దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. యాక్షన్, ఎమోషన్ ఎలిమెంట్స్ తో భారీ స్థాయిలో ఆ సినిమా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మూవీపై అంచనాలు పెంచింది.

ఆయుధం పట్టుకుని డేంజరస్ లుక్‌ లో కనిపించిన మనోజ్, తనలోని కొత్త కోణాన్ని డేవిడ్ రెడ్డి మూవీ బయటపెడుతుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఎలాంటి క్షమాగుణం లేని పాత్ర అంటూ ఇచ్చిన హింట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇక హీరోయిన్‌ గా తమిళ చిత్రం ప్రిన్స్ ద్వారా గుర్తింపు పొందిన మరియా నటిస్తున్నారు. పీరియాడికల్ సెట్టింగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలతో మూవీ రూపొందుతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. మరి ఆ సినిమాతో మనోజ్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.



Tags:    

Similar News