మ‌న స్టార్లు 40 నుంచి 45 వైపు.. అప్ప‌టికి పాన్ వ‌ర‌ల్డ్ చిక్కుతుందా?

వయస్సు అనేది కేవలం అంకె మాత్రమే అని భార‌త‌దేశంలోని స్టార్లు ఇప్పటికే నిరూపించారు. మ‌న స్టార్లకు 40 ఏళ్లు దాటాకే నిజమైన పాన్ ఇండియా సక్సెస్ లభించింది.;

Update: 2026-02-28 15:30 GMT

పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను శాసిస్తున్న సౌతిండియా టాప్ స్టార్లు ఇప్పుడు 40 ప్లస్ (ఏజ్‌) క్లబ్‌లో అత్యంత శక్తివంతంగా కొనసాగుతున్నారు. అయితే మరో ఐదేళ్లలో వీరి వయస్సు, భవిష్యత్ ప్రయాణం ఎలా ఉండబోతోందో ఒక విశ్లేషణాత్మక కథనం ప‌రిశీలిస్తే...

ప్రస్తుతం భారతీయ సినిమా మార్కెట్‌ను తమ భుజాలపై మోస్తున్న టాప్ హీరోలంతా 40 ఏళ్ల మైలురాయిని దాటేశారు. వీరిలో కొందరు 50కి చేరువలో ఉండగా.. మరికొందరు ఇప్పుడే 40లోకి అడుగుపెట్టారు. వీరంతా తమ కెరీర్‌లో సుమారు 20 ఏళ్ల అనుభవాన్ని గడించి ఇప్పుడు `పీక్ స్టేజ్`లో ఉన్నారు. మ‌రో ఐదేళ్లలో వీరి స్థానం, ఎనర్జీ లెవెల్స్ లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయ‌న‌డంలో సందేహం లేదు.

మహేష్ బాబు (50):

1999లో `రాజకుమారుడు` చిత్రంతో హీరోగా పరిచయమై 27 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ప్రస్తుతం మ‌హేష్ వ‌య‌సు 50. ఈ ఏజ్ లోను ఎంతో ఎన‌ర్జిటిక్ గా రాజమౌళితో భారీ యాక్ష‌న్ అడ్వెంచర్ తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగేందుకు సిద్ధమయ్యారు. మ‌రో ఐదేళ్లు గ‌డిస్తే 2030లోకి కాలం మారుతుంది. అప్ప‌టికి 55 ఏళ్ల వయస్సులోనూ ఆయన తన ఫిజిక్‌తో కుర్ర హీరోలకు పోటీనిస్తూనే ఉంటారు. సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న 70ల ఏజ్ వ‌ర‌కూ కూడా స్టార్ హీరోగా త‌న అస‌మాన‌మైన‌ ఎన‌ర్జీతో అల‌రించారు. అదే బాట‌లో మ‌హేష్ కూడా ప్ర‌యాణిస్తార‌ని అంచ‌నా. వార‌ణాసి మొద‌లు మ‌హేష్ మ‌రో కొత్త ఇన్నింగ్స్ ని ప్ర‌పంచ మార్కెట్లో చూపించ‌బోతున్నారు.

ప్రభాస్ (46):

2002లో `ఈశ్వర్`తో మొదలైన ప్రయాణం 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. 46 వ‌య‌సులో ప్ర‌భాస్ అద‌ర‌గొడుతున్నాడు. అత‌డి ఎన‌ర్జీ లెవ‌ల్స్ పీక్స్ లో ఎలివేట్ అవుతున్నాయి. ఒడ్డు పొడుగు భుజ‌బ‌లం కండ‌బ‌లంలో ప్ర‌భాస్ కి ఎదురే లేదు! అని నిరూప‌ణ అవుతోంది. `బాహుబలి`తో ఇండియాలోనే మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్‌గా, తొలి 1000 కోట్ల క్ల‌బ్ హీరోగా అవతరించారు. ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ తో క‌ల్కి 2898 ఏడితో మ‌రో లెవ‌ల్ చూపించ‌బోతున్నాడు. 50 ఏళ్లు దాటినా ఆయన మాస్ ఇమేజ్, కటౌట్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంటుంది.

అల్లు అర్జున్ (43):

2003లో `గంగోత్రి`తో ఎంట్రీ ఇచ్చి 23 ఏళ్లుగా స్టార్ గా రాణిస్తున్నారు. `పుష్ప`తో నేషనల్ సెన్సేషన్‌గా మారారు. మరో ఐదేళ్లలో 48 ఏళ్ల వయస్సులోనూ ఆయన డ్యాన్స్, ఎనర్జీ తగ్గే ప్రసక్తే లేదని ఆయన లైనప్ చూస్తే అర్థమవుతుంది. అత‌డు పుష్ప 2 తో 1000 కోట్ల క్ల‌బ్ హీరోగా స‌త్తా చాటాడు. ప్ర‌భాస్ త‌ర్వాత ప్రామిస్సింగ్ పాన్ ఇండియ‌న్ హీరోల‌లో ఒక‌రిగా అల్లు అర్జున్ త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. త‌దుప‌రి అట్లీ ద‌ర్శ‌క‌త్వంలోని భారీ సైఫై ఫాంట‌సీ చిత్రంతో త‌న స్థాయిని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్ల‌బోతున్నారు. మ‌రో ఐదేళ్ల‌లో బ‌న్ని స్థాయిని ఒక హాలీవుడ్ స్టార్ కి త‌క్కువ‌గా చూడ‌లేమ‌ని అభిమానులు బ‌లంగా న‌మ్ముతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ (42):

2001లో `నిన్ను చూడాలని`తో మొదలై 25 ఏళ్లుగా `మ్యాన్ ఆఫ్ మాసెస్`గా కొనసాగుతున్నారు. RRR, దేవరతో గ్లోబల్ క్రేజ్ సంపాదించారు. మ‌రో ఐదేళ్ల‌లో అత‌డి వ‌య‌సు 47. ఆ వయస్సులోనూ ఆయన నటన... డైలాగ్ డెలివరీ పాన్ ఇండియా మార్కెట్‌ను శాసిస్తాయి. డ్యాన్సుల్లో అత‌డు కింగ్ అని నిరూపించాడు. పాన్ ఇండియా స్టార్ గా త‌న స్థాయిని మ‌రింత పెంచుకునేందుకు ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ తో డ్రాగ‌న్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది పాన్ వ‌ర‌ల్డ్ లో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌భాస్, అల్లు అర్జున్, చ‌ర‌ణ్ త‌ర‌హాలోనే 1000 కోట్ల క్ల‌బ్ హీరోగా ఎన్టీఆర్ త‌న స్థాయిని మ‌రో రేంజుకు తీసుకెళ్ల‌బోతున్నాడు.

రామ్ చరణ్ & యష్ (40):

వీరిద్దరూ ఇప్పుడే 40లోకి అడుగుపెట్టారు. చరణ్ 19 ఏళ్లుగా, యష్ 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. మ‌రో ఐదేళ్లు వీరికి అత్యంత కీలకం. 45 ఏళ్ల వయస్సులో వీరు తమ కెరీర్ ప్రైమ్ టైమ్‌లో ఉంటారు. చిరుత చిత్రంతో కెరీర్ ప్రారంభించిన రామ్ చ‌ర‌ణ్‌ రంగస్థ‌లం, ధృవ చిత్రాల‌తో త‌న‌లోని పూర్తి స్థాయి న‌టుడిని బ‌య‌ట‌కు తీసారు. అభినయంలో తండ్రిని మించిన త‌న‌యుడిగా నిరూపించారు. ఆర్.ఆర్.ఆర్ తో చ‌ర‌ణ్ 1000 కోట్ల క్ల‌బ్ హీరో అయ్యాడు. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `పెద్ది` చిత్రంలో న‌టిస్తున్నారు. భార‌త‌దేశంలోని టాప్ నాచ్ పాన్ ఇండియా స్టార్ల‌లో ఒక‌రిగా సత్తా చాటుతున్నారు. ఇక కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాల‌తో రాకింగ్ స్టార్ య‌ష్ భార‌త‌దేశంలోని ప్రామిస్సింగ్ స్టార్ల‌లో ఒక‌రిగా ఎదిగారు. ప్ర‌స్తుతం రామాయ‌ణం, టాక్సిక్ లాంటి చిత్రాల‌తో అత‌డు మ‌రో స్థాయిని ట‌చ్ చేయ‌బోతున్నాడు. 45 ఏళ్ల వ‌య‌సులో చ‌ర‌ణ్‌, య‌ష్ స్థాయి ఎలా ఉండ‌బోతోందో అభిమానులు ఎవ‌రికి వారు ఇమాజినేష‌న్ లో ఉన్నారు.

భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

మరో ఐదేళ్లలో మహేష్, ప్రభాస్ 50 క్రాస్ చేసినా.. చరణ్, ఎన్టీఆర్, యష్ 45లలో ఉన్నా.. వీరి ఎనర్జీ తగ్గే అవకాశం తక్కువ. భ‌విష్య‌త్ అంతా టెక్నాల‌జీ మ‌యం. ప్రస్తుత కాలంలో యాంటీ ఏజింగ్ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సహాయంతో హీరోలను వెండితెరపై ఎనర్జిటిక్‌గా చూపించడం సులభం. ఈ హీరోలంతా ఇప్పుడు వయస్సుతో సంబంధం లేని లార్జర్ దన్ లైఫ్ కథలను (కల్కి 2898 ఏడి, ఆర్.ఆర్.ఆర్, వారణాసి, డ్రాగన్ వంటివి) ఎంచుకుంటున్నారు.

నేటి హీరోలు తమ డైట్, ఫిట్‌నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నారు. హాలీవుడ్ హీరోలు టామ్ క్రూజ్ (60+), బాలీవుడ్ సూప‌ర్ స్టార్ లు షారూఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ త‌ర‌హాలోనే ఏజ్ లెస్ గా మ‌న స్టార్లు కూడా 50 ప్లస్‌లోనూ యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తూనే ఉంటారు. మ‌న టాప్ 6 హీరోలు పాన్ వ‌ర‌ల్డ్ ని ఏల‌డ‌మే ధ్యేయంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

వయస్సు అనేది కేవలం అంకె మాత్రమే అని భార‌త‌దేశంలోని స్టార్లు ఇప్పటికే నిరూపించారు. మ‌న స్టార్లకు 40 ఏళ్లు దాటాకే నిజమైన పాన్ ఇండియా సక్సెస్ లభించింది. కాబట్టి మరో ఐదేళ్ల తర్వాత కూడా వీరు పాన్ ఇండియాని ఏల‌డ‌మే గాక పాన్ వ‌రల్డ్ కి త‌మ రేంజును విస్త‌రిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. కాలమే వీరు సృష్టించే కొత్త రికార్డులకు సాక్ష్యంగా నిలుస్తుంది.

Tags:    

Similar News