బాలయ్య అడుగు ఎవరి వైపుకో?
ఇప్పటికే తన 111వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య, ఈ సినిమాను మార్చిలో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.;
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చిన్న విరామంలో ఉన్నప్పటికీ, ఆయన తర్వాతి సినిమాలపై డిస్కషన్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే తన 111వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య, ఈ సినిమాను మార్చిలో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. బాలయ్యతో వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తీసిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని సమాచారం.
బాలయ్యకు కథ చెప్పిన హరీష్ శంకర్
ఇదే సమయంలో, 2027 సంక్రాంతికి మరో సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో కూడా బాలకృష్ణ ఉన్నారని తెలుస్తోంది. బాలయ్య కెరీర్లో NBK112గా రానున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రస్తుతం ఆయన ముందు పలు ఆప్షన్లున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివిధ దర్శకులు, నిర్మాతలు బాలయ్యకు కథలు వినిపిస్తూ ఆయనతో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే కమర్షియల్ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్, బాలయ్యకు ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను నాగ వంశీ నిర్మించేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. అయితే ఈ సినిమా పట్టాలెక్కేదీ లేనిదీ త్వరలో హరీష్ శంకర్ నుంచి రానున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫలితంపై ఆధారపడనుంది.
వివేక్ ఆత్రేయతో బాలయ్య మూవీ?
హరీష్ శంకర్ తో పాటూ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా బాలయ్యకు ఓ కథ చెప్పినట్టు తెలుస్తోంది. ఎమోషన్స్ కు ప్రాధాన్యతనిచ్చే కథలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ తో సినిమా ఓకే అయితే, దాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందే అవకాశం ఉండటంతో, ప్రస్తుతానికి డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం.
ఆదిత్య999పై వర్క్ చేస్తున్న బాలయ్య
వీరిద్దరూ కాకుండా, బాలయ్యతో ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేసిన క్రిష్ జాగర్లమూడి, ఆదిత్య 999పై వర్క్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి, పరిస్థితులు అనుకూలిస్తే ఈ ప్రాజెక్టు కూడా ముందకెళ్లే అవకాశముందని సమాచారం. అవి కాకుండా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా బాలయ్యకు రెండు మూడు స్టోరీ ఆప్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే బాలయ్య ముందు ఇన్ని అవకాశాలున్నప్పటికీ ఆయన మాత్రం ఇప్పటివరకు ఏ ప్రాజెక్టుకూ సైన్ చేసింది లేదు.
మొత్తానికి బాలయ్య తర్వాతి సినిమా విషయంలో ఆయనకు చాలానే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాలి. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ కథల వరకు విభిన్న జానర్ల అవకాశాలున్నాయి. ఈ సమ్మర్ కల్లా బాలయ్య తర్వాతి ప్రాజెక్టు విషయంలో క్లారిటీవచ్చే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి బాలయ్య అడుగు ఏ దిశగా పడుతుందో చూడాలి.