అమెరికాలో తెలుగు బలంకు ఇదే సాక్ష్యం

ఒకప్పుడు ఇండియన్‌ సినిమాలు యూఎస్‌లో చూడాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇండియాలో కంటే ముందే అక్కడ షో లు పడుతున్నాయి.

Update: 2026-09-16 07:58 GMT

అమెరికాలో ఇండియన్స్ సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఇండియా నుంచి అక్కడకు వెళ్లే వారు తక్కువ అయ్యారు. అలాగే వీసా సమస్యల కారణంగా అక్కడకు వెళ్లడం సాధ్యం కావడం లేదు, కానీ ఇంతకు ముందు పెద్ద సంఖ్యలో ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన విషయం తెల్సిందే. అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో ఎక్కువ శాతం ఇండియన్స్ ఉంటారు అని ఒక సర్వేలో వెళ్లడి అయింది. పదుల సంవత్సరాల నుండి అక్కడ ఉంటున్న వారు, రెండు మూడు తరాల నుంచి అక్కడ ఉంటున్న వారు ఏకంగా స్థానిక రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉంటున్నారు. ఒకప్పుడు ఇండియన్‌ సినిమాలు యూఎస్‌లో చూడాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇండియాలో కంటే ముందే అక్కడ షో లు పడుతున్నాయి.

టాలీవుడ్‌ సినిమాలకు యూఎస్‌ మార్కెట్‌...

తెలుగు సినిమాలకు యూఎస్ అనేది మరో నైజాం ఏరియా గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల సినిమాలకు వరకు ఓవర్సీస్‌లో విడుదల కావడం ఈ మధ్య కాలంలో చాలా కామన్‌ అయింది. హిట్‌ సినిమాలకు పదుల కోట్ల వసూళ్లు అక్కడ నమోదు అవుతున్నాయి. కొన్ని ఇండియన్‌ సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా పది మిలియన్‌ డాలర్లను మించి వసూళ్లు చేసిన దాఖలాలు ఉన్నాయి. యూఎస్‌లో ఇండియన్‌ సినిమాలకు ఏ స్థాయిలో డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో తెలుగులో విడుదల అయిన దాదాపు 80 శాతం సినిమాలను పరిమిత స్క్రీన్స్‌ నుంచి మొదలుకుని భారీ ఎత్తున స్క్రీన్స్‌ లో యూఎస్‌లో స్క్రీనింగ్‌ చేయడం జరుగుతుంది. ఇతర ఇండియన్ సినిమాలతో పోల్చితే తెలుగు సినిమాలు యూఎస్‌లో అత్యధిక వసూళ్లు నమోదు చేస్తున్నట్లుగా లెక్కలు ఉన్నాయి.

యూఎస్‌లో తెలుగు సినిమాల రిలీజ్‌...

యూఎస్‌లోని కొన్ని ఏరియాల్లో ఇండియన్స్‌ ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువ అవుతున్నారు. డల్లాస్ వంటి ప్రాంతాల్లో తెలుగు వారు ఎక్కువ అయ్యారు. అక్కడ బయటకు వెళ్తే తెలుగు వారు కనిపిస్తారని అంటారు. తెలుగు వారు ఎక్కువ ఉండే డల్లాస్‌లో స్టార్‌ హీరోల సినిమాలు విడుదల అయిన సమయంలో సందడి మామూలుగా ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే హడావిడి చేస్తారో అక్కడ కూడా తెలుగు సినీ ప్రేక్షకులు హడావిడి చేస్తూ ఉంటారు. అందుకే అక్కడి థియేటర్‌లలో తెలుగు సినిమాలకు ప్రముఖ స్థానం ఉంటుంది. ఇప్పుడు ఏకంగా ఒక థియేటర్‌లో తెలుగు మెనును ఏర్పాటు చేయడం వైరల్‌గా మారింది. సినీమార్క్‌ లోని క్యాంటిన్‌లో ఫుడ్‌ మెనును తెలుగులో ఏర్పాటు చేసినట్లుగా సోషల్‌ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. దీన్ని బట్టి తెలుగు అనేది యూఎస్‌లో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

యూఎస్‌లోని సినీమార్క్‌లో తెలుగు..

తెలుగు లిపిలో తెలుగు వారు తినే ఆహార పదార్థాలను యూఎస్‌ థియేటర్‌లో ఏర్పాటు చేయడం అంటే అక్కడ తెలుగు వారు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా యూఎస్‌లోని అన్ని థియేటర్‌లలో కేవలం ఇంగ్లీష్‌ లోనే ఫుడ్‌ మెను ఉంటుంది. కానీ సినీమార్క్‌లో మాత్రమే తెలుగు లిపిలో ఫుడ్‌ మెనును ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. సదరు థియేటర్‌ ఎందుకు తెలుగు లిపిలో ఫుడ్‌ మెను ను ఏర్పాటు చేసింది అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో తెలుగు లిపిలో ఫుడ్‌ మెను ను ఏర్పాటు చేసి ఉండవచ్చు అని కొందరు అంటున్నారు. అయితే వైరల్‌ అవుతున్న ఫోటో తీసిన సమయంలో ఈ థియేటర్‌లో ఏ సినిమా ఆడుతుంది అనే విషయమై స్పష్టత లేదు. అయితే యూఎస్‌లో తెలుగు వారి బలం భారీగా పెరుగుతుంది అనేందుకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News