టాలీవుడ్ సామ్రాజ్యంలో మెగా - అల్లు వంశ వృక్షం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో `మెగా` అనే పదం ఒక బ్రాండ్. కొన్ని దశాబ్దాలుగా బాక్సాఫీస్‌ను శాసిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న వార‌సులు, అల్లు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం టాలీవుడ్‌లోనే అత్యంత శక్తివంతమైనది.;

Update: 2026-02-28 23:30 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో `మెగా` అనే పదం ఒక బ్రాండ్. కొన్ని దశాబ్దాలుగా బాక్సాఫీస్‌ను శాసిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న వార‌సులు, అల్లు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం టాలీవుడ్‌లోనే అత్యంత శక్తివంతమైనది. చిరంజీవి తన అసాధారణ స్వయంకృషితో శిఖరాగ్రానికి చేరితే, అల్లు కుటుంబం ఆయన వెన్నంటి ఉండి ఒక భారీ సినీ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ రెండు కుటుంబాల కలయికతో ఏర్పడిన `మెగా వంశ వృక్షం` నేడు గ్లోబల్ స్థాయిలో విస్తరించి భారతీయ సినిమా గతిని మారుస్తోంది.

ఈ మహావృక్షానికి అసలైన పునాది వేసింది సినీనిర్మాత‌- పద్మశ్రీ అల్లు రామలింగయ్య. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన లెజెండరీ హాస్యనటుడైన ఆయన.. అప్పట్లోనే విజన్ తో త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రించారు. ఆయనకు అల్లు అరవింద్, సురేఖ, నవభారతి, వసంత లక్ష్మి అనే నలుగురు పిల్లలు. అప్ప‌టికి యువ‌హీరో అయిన‌ చిరంజీవిలోని అంకితభావం, క్రమశిక్షణను గుర్తించిన రామలింగయ్య తన కుమార్తె సురేఖను ఆయనకు ఇచ్చి 1980లో వివాహం జరిపించారు. అలా చిరంజీవి అల్లు కుటుంబానికి అల్లుడు కావడంతో పాటు, ఆ రెండు కుటుంబాల ప్రతిభ ఏకమై ఒక బలమైన సినీ శక్తిగా అవతరించింది.

ఈ సామ్రాజ్య నిర్మాణంలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పాత్ర అనన్యసామాన్యం. ఒక పక్క చిరంజీవి తన స్టార్‌డమ్‌తో ఒక్కో శిఖ‌రాన్ని అధిగ‌మిస్తుంటే.. అల్లు అరవింద్ ఒక గొప్ప స్ట్రాటజిస్ట్‌గా `గీతా ఆర్ట్స్` ద్వారా అద్భుతమైన కథలను ఎంపిక చేసి ఆయనను మాస్ హీరోగా నిలబెట్టారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అనేక బ్లాక్‌బస్టర్లు చిరంజీవిని నెంబర్ వన్ స్థానంలో సుస్థిరం చేశాయి. ముఖ్యంగా రెగ్యుల‌ర్ హీరోల మ‌ధ్య మెగా ఫీవ‌ర్ ని రాజేసిన సుప్రీంహీరోగా, మెగాస్టార్ గా చిరంజీవి ఎదిగిన తీరు అన‌న్య సామాన్య‌మైన‌ది. ఆయ‌న స్వయంకృషితో సాధించుకున్న విజ‌యాలు ఇవ‌న్నీ. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేక మేనరిజంతో పవర్‌స్టార్ గా ఎదిగి.. నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ శిఖరాలను అధిరోహించడం విశేషం.

వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ కుటుంబం సాటిలేనిది. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ RRR చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా అంతర్జాతీయ గుర్తింపు పొందితే, అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ `పుష్ప` సినిమాతో నేషనల్ అవార్డు గ్రహీతగా, ఐకాన్ స్టార్‌గా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. చ‌ర‌ణ్‌- అర్జున్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ సినీరంగంలో గ్లోబ‌ల్- ఐక‌న్స్ గా శిఖ‌రాగ్రానికి చేరుకుంటున్నారు. వీరితో పాటు వరుణ్ తేజ్, సాయి దుర్గ‌ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి యువ హీరోలు తమకంటూ ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమా `ఉప్పెన`తోనే 100 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డు సృష్టించడం మెగా మేనల్లుళ్ల సత్తాను చాటి చెప్పింది.

కేవలం తెరముందే కాకుండా.. తెర వెనుక కూడా ఈ వంశ వారసులు తమ ప్రతిభను చాటుతున్నారు. నాగేంద్ర బాబు అంజనా ప్రొడక్షన్స్ ద్వారా, రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ ద్వారా.. చిరంజీవి కుమార్తె సుస్మిత `గోల్డ్ బాక్స్` బ్యానర్‌తో నిర్మాతలుగా రాణిస్తున్నారు. అటు అల్లు కుటుంబం నుండి అల్లు బాబీ, అల్లు వెంకటేష్ కూడా సినీనిర్మాణ రంగంలో విజయవంతంగా కొనసాగుతున్నారు. 6 మార్చి 2026న అల్లు శిరీష్ వివాహం నయనికా రెడ్డితో జరగనుండటం ఈ కుటుంబంలో ప్రస్తుత వేడుక‌లు అంబ‌రాన్నంటుతున్నాయి. ఈ వేడుక‌ల్లో మెగా కుటుంబం కూడా భాగ‌మై మ‌రింత ఉత్సాహం పెంచుతోంది.

మెగా వృక్షం ఇప్పుడు నాలుగో తరంలోకి కూడా అడుగుపెట్టింది. రామ్ చరణ్ కు ఇప్పుడు ముగ్గురు వార‌సులు. కుమార్తె క్లింకార కొణిదెల, క‌వ‌ల‌లు శివ‌రామ్ కొణ‌దెల‌, అన్విరా దేవి కొణిదెల తో ఆ కుటుంబం నిండుకుండ‌లా ఉంది. అల్లు అర్జున్ వారసులు అల్లు అయాన్, అల్లు అర్హలపై ఇప్పుడే భారీ అంచనాలు ఉన్నాయి. అర్హ ఇప్పటికే బాలనటిగా తన ప్రతిభను నిరూపించుకోగా, క్లింకార పేరు మీద జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ చిన్నారులు భవిష్యత్తులో ఈ లెగసీని మరిన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తారని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మెగా వృక్షానికి సమానంగా అల్లు వృక్షం కూడా నేడు గ్లోబల్ స్థాయిలో విస్తరిస్తోంది. ఒకప్పుడు మద్రాసులో చిన్న మొక్కగా మొదలైన ఈ ప్రయాణం నేడు వందల కోట్ల టర్నోవర్ కలిగిన ఒక భారీ పరిశ్రమలో భాగంగా మారింది. బావ-మరుదులైన చిరంజీవి- అల్లు అరవింద్ ఒకరికొకరు తోడుగా నిలబడి నిర్మించిన ఈ సామ్రాజ్యం.. భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిదాయకమైన గమ్యస్థానంగా నిలుస్తుంది.

Tags:    

Similar News