నాగార్జున BB 'దశావతారం'కు ముహూర్తం ఫిక్స్‌

హిందీ ప్రేక్షకులను రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి దశాబ్ద కాలం అవుతుంది.

Update: 2026-08-01 06:01 GMT

హిందీ ప్రేక్షకులను రెండు దశాబ్దాలుగా అలరిస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి దశాబ్ద కాలం అవుతుంది. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండో సీజన్‌కు నాని హోస్టింగ్‌ చేశాడు. ఇక మూడవ సీజన్‌ నుంచి వరుసగా ఏడు సీజన్‌లకు, మధ్యలో ఒక ఓటీటీ సీజన్‌కు నాగార్జున హోస్టింగ్‌ చేశాడు. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌ 10వ సీజన్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడు రెగ్యులర్‌ సీజన్‌లు, ఒక ఓటీటీ సీజన్‌కు హోస్టింగ్‌ చేసిన నాగార్జున ఇప్పుడు తన 9వ సీజన్‌కు హోస్టింగ్‌కు రెడీ అవుతున్నాడు. తెలుగు బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్‌ను స్టార్‌ మా ఫుల్‌గా వాడేసుకుంటుంది. బిగ్‌బాస్‌ కి సన్నాహకం అన్నట్లుగా అగ్నిపరీక్షను ఈ సీజన్ కోసం నిర్వహించారు. పెద్ద ఎత్తున ఔత్సాహికులు బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. ముందుకు వచ్చి తమ ఆడిషన్స్‌ను ఇచ్చినట్లుగా స్టార్‌ మా ప్రకటించింది.

స్టార్‌ మాలో బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష ను ఈ నెలలో స్టార్‌ మా టెలికాస్ట్‌ చేయబోతుంది. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు రెండు లేదా మూడో వారంలో అగ్నిపరీక్షను స్టార్‌ మా లో టెలికాస్ట్‌ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అగ్ని పరీక్షలో నెగ్గిన వారికి బిగ్‌బాస్‌లో అవకాశం ఉంటుంది. మొత్తానికి తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్‌బాస్ సందడి మొదలు అయింది. ఇక బిగ్‌బాస్ ఈసారి పదవ సీజన్‌ కనుక దశావతారం అనే ట్యాగ్‌ లైన్‌ను పెట్టారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ సెట్‌ నిర్మాణం ప్రారంభం అయింది. అంతే కాకుండా మరో వైపు నాగార్జున మీద బిగ్‌బాస్‌ 10 కి సంబంధించిన ప్రోమో సైతం చిత్రీకరణ చేశారని వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు వారాల్లో ఆ ప్రోమో వదలబోతున్నారు. అంతే కాకుండా అగ్ని ప్రరీక్షకు సంబంధించిన ప్రోమోలోను నాగార్జున కనిపించబోతున్నట్లుగా స్టార్‌ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10...

అగ్ని పరీక్షను ఈ నెలలోనే ప్రారంభించి, బిగ్‌బాస్‌ సీజన్‌ 10 దశావతారంను సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే బిగ్‌బాస్‌ 10 లో పాల్గొనబోతున్న సెలబ్రిటీల జాబితా రెడీ అయింది. సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, సోషల్‌ మీడియా ద్వారా దాదాపుగా 25 మందిని ఎంపిక చేయడం జరిగింది. అందులోంచి మొదటగా 10 మందిని ఎంపిక చేసి సీజన్‌ 10 లో కంటెస్టెంట్స్‌గా లోనికి పంపించబోతున్నారు. మూడు లేదా నాలుగు వారాల తర్వాత మరికొందరిని పంపిస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఈసారి వెరైటీగా ఒకసారి పది మందిని, మరోసారి పది మందిని హౌస్‌లోకి పంపే విధంగా స్క్రిప్ట్‌ రెడీ అవుతుందని తెలుస్తోంది. అందులో సామాన్యులు ఎంత మంది ఉంటారు, అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక అయిన వారు ఎప్పుడు వెళ్తారు అనే విషయాలు ముందు ముందు తెలిసే అవకాశం ఉంది.

బిగ్‌బాస్‌ దశావతారంలో నాగార్జున...

నాగార్జున ఒక వైపు తన 100వ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయిందని, మిగిలిన సగం షూటింగ్‌ పూర్తి చేసి సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగ్‌ 100వ సినిమా సూపర్‌ హిట్‌ ఖాయం అని అక్కినేని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అదే సమయంలో నాగ్‌ బిగ్‌బాస్‌ దశావతారం సైతం భారీ విజయం సాధించబోతుందని, ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ చరిత్రలో రాని రేటింగ్‌ సీజన్ 10 కి రాబోతుందనే విశ్వాసంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ సీజన్‌ 10 దశావతారంతో నాగార్జున సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనేది కన్ఫర్మ్‌. ఇప్పటికే కొందరి కంటెస్టెంట్స్ పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. కానీ స్టార్‌ మా నుంచి సీజన్‌ 10 ప్రారంభం రోజు మాత్రమే అధికారిక ప్రకటన రానుంది. అప్పటి వరకు వచ్చే పేర్లన్నీ ఊహాగానాలు మాత్రమే.

Tags:    

Similar News