భార‌త్‌లో 200 కోట్లు? ఆల్ టైమ్ బెస్ట్ స్పైడర్ మ్యాన్ సినిమా ఇదేనా!

మార్వెల్ సూపర్‌హీరో `స్పైడర్ మ్యాన్` భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు.

Update: 2026-08-01 06:01 GMT

మార్వెల్ సూపర్‌హీరో `స్పైడర్ మ్యాన్` భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసియు) నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` జులై 30న భారతదేశంలో విడుదలై కాసుల వర్షం కురిపిస్తోంది. డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్త విడుదల కంటే ఒక రోజు ముందే మనదేశంలో 2డి, 3డి ఫార్మాట్లలో అడుగుపెట్టింది. డే వ‌న్ అద్భుతమైన పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే భారతదేశంలో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా వ‌సూళ్ల జోష్ చూస్తుంటే ఇది ఫుల్ ర‌న్ లో 200 కోట్ల క్ల‌బ్ అందుకోవ‌డం సాధ్య‌మేన‌ని అంచ‌నా వేస్తున్నారు. స్పైడ‌ర్ మేన్ ఫ్రాంఛైజీలో గ‌త చిత్రాలు 100-150 కోట్ల రేంజు వ‌సూళ్ల‌ను సాధించ‌గా, ఇప్పుడు బ్రాండ్ న్యూడే మాత్రం 200 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెడుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధిస్తున్న గణాంకాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మొదటి రోజే 60.60 కోట్ల నెట్ రాబట్టిన ఈ చిత్రం, `పఠాన్` (57 కోట్లు), వార్ (53.35 కోట్లు) వంటి భారతీయ బడా చిత్రాల ఫస్ట్ డే రికార్డులను సైతం బ్రేక్ చేసింది. రెండవ రోజు మరో 28.03 కోట్ల నికర లాభాన్ని జోడించడంతో ఈ సినిమా నెట్ కలెక్షన్స్ 88.63 కోట్లకు చేరాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తొలిరోజే 72.44 కోట్ల గ్రాస్ సాధించిన ఈ మూవీ... రెండో రోజు నాటికి అత్యంత వేగంగా 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.

కథాంశం విషయానికొస్తే.. ఈ సినిమా 2021లో వచ్చిన `స్పైడర్ మ్యాన్: నో వే హోమ్` ముగింపు సంఘటనలకు నాలుగు సంవత్సరాల తర్వాత సాగే కథతో తీర్చిదిద్దారు. తనను ప్రేమించే వారందరి జ్ఞాపకాల నుంచి తన ఉనికిని పూర్తిగా చెరిపేసుకున్న పీటర్ పార్కర్... తీవ్ర ఒంటరితనంతో బాధపడుతూ జీవిస్తుంటాడు. ఈ క్రమంలో నేరాలపై పోరాటం చేస్తూ తన శరీరంలో వచ్చే అనూహ్యమైన భౌతిక మార్పులను తట్టుకుంటూనే... ఊహించని రీతిలో ఎదురైన ఒక కొత్త శత్రువును పీటర్ ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ చిత్రంలో ఎంతో ఆసక్తికరంగా చూపించారు.

కేవిన్ ఫెయిజ్-అమీ పాస్కల్ నిర్మించిన ఈ చిత్రం ఎంసియులో 38వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టామ్ హాలండ్, జెండయాల జంటతో పాటు ఇతర ప్రధాన పాత్రలు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. మార్వెల్ అభిమానులకు గొప్ప విజువల్ ట్రీట్ ఇస్తూ మార్క్ రుఫాలో (హల్క్-బ్రూస్ బేనర్), జాన్ బెర్నాల్ (ది పనిషర్), మైఖేల్ మాండో (స్కార్పియన్) వంటి పవర్‌ఫుల్ నటులు భాగం కావడంతో సినిమా స్థాయి మరో రేంజ్‌కు చేరింది.

మొదటి రెండు రోజుల్లోనే ఈ స్థాయి సునామీ సృష్టించడంతో త‌దుపరి వీకెండ్‌లో ఈ మూవీ మరిన్ని అరుదైన బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. బలమైన ఎమోషన్స్...ఊపిరాడ‌నివ్వ‌ని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఆల్ టైమ్ బెస్ట్ స్పైడర్ మ్యాన్ సినిమాల జాబితాలో ఇది ఏ స్థానంలో నిలుస్తుందో వేచి చూడాలి .. ప్ర‌స్తుతానికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మార్వెల్ హీరో సరికొత్త రికార్డులతో ఊచ‌కోత కోస్తోంది.

Tags:    

Similar News