ఫ్లాష్ బ్యాక్: 'మరణ మృదంగం' లొకేషన్లో చిరూపై జరిగిన విష ప్రయోగం!

Update: 2021-10-15 00:30 GMT
జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్లలో సంతోషపడేవారి సంఖ్య తగ్గుతూ ఉంటుంది. అసూయపడేవారి సంఖ్య అమాంతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకపోయినా ఎదుగుదలకు శత్రువులు తయారవుతూనే ఉంటారు. సమయం చూసుకుని విషం చిమ్మడానికి చూస్తూనే ఉంటారు. ఈర్ష్య .. ద్వేషంతో రగిపోయేవాళ్లు, కెరియర్ పరంగా దూసుకుపోతున్నవారిని పడదోయడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని స్థితికి చేరుకుంటారు. అలాంటి కుట్ర ఒకటి 33 ఏళ్ల క్రితం చిరంజీవిపై కూడా జరిగింది.

చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత తన ప్రతిభాపాటవాలతో ముందుకు దూసుకుపోతున్న రోజులవి. డాన్సులు .. ఫైట్ల విషయంలో చెలరేగిపోతూ, అప్పటివరకూ ఇండస్ట్రీకి తెలియని ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన స్టైల్ ను అనుకరించనివారు లేరు. ఎవరైనా కాస్త స్టైల్ గా కనిపిస్తే 'చిర్రూ' అంటూ ఆ కుర్రాడిని యూత్ ఆటపట్టించేలా ఆయన అందరి నోళ్లలో అంతగా నానడం మొదలుపెట్టారు. 'సుప్రీం హీరో' అనిపించుకున్న ఆయన వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఆయన స్పీడ్ ను అందుకువడం .. అడ్డుకోవడం ఎవరివలన కాని పరిస్థితి అది.

అలాంటి పరిస్థితుల్లోనే చిరంజీవి 'మరణ మృదంగం' షూటింగు మద్రాస్ బేస్ కోర్టులో జరుగుతోంది. ఆయనను చూడటానికి చాలామంది అభిమానులు అక్కడికి వచ్చారు. షూటింగు గ్యాపులో ఒక అభిమాని ఆయన దగ్గరికి వచ్చాడు. తాను ఆయనకి వీరాభిమానిని అంటూ చెప్పుకున్నాడు. ఆ రోజున తన పుట్టినరోజని చెప్పి, చిరంజీవి సమక్షంలో కేక్ కట్ చేయాలనే ఆశతో వచ్చానని అన్నాడు. అందుకు చిరంజీవి సరేనని అనడంతో, ఆ వ్యక్తి తన వెంట తెచ్చిన కేక్ ను చిరంజీవి ముందుంచి కేక కట్ చేశాడు. ఆ తరువాత ఒక కేక్ పీస్ తీసి చిరంజీవికి ఇవ్వబోయాడు.

చిరంజీవి సున్నితంగా తిరస్కరించడంతో, ఊహించని విధంగా ఆయన నోట్లో ఆ కేక్ పీస్ పెట్టడానికి ప్రయత్నించాడు. దాంతో చిరంజీవి ఒక్కసారిగా బిత్తరపోయారు. తన ప్రమేయం లేకుండానే ఆయన ఆ కేక్ ను టేస్ట్ చేసినట్టు అయింది.

చిరంజీవితో బలవంతంగా కేక్ తినిపించడానికి ఆ వ్యక్తి చేసిన ప్రయత్నంలో కేక్ క్రిందపడిపోయింది. ఇదంతా చూస్తున్న యూనిట్ సభ్యులకు ఆ కేక్ తయారీ .. అభిమానినంటూ వచ్చిన వ్యక్తి ప్రవర్తన కాస్త తేడాగా అనిపించాయి. అదే సమయంలో వాళ్లు చిరంజీవి పెదాలు రంగుమారుతుండటం గమనించారు. ఆయనపై విషప్రయోగం జరిగిందని గ్రహించారు. వెంటనే ఆయనను హాస్పిటల్ కి తరలించారు.
4

ఆయనపై విషప్రయోగానికి ప్రయత్నం జరిగిందనీ .. తృటిలో బయటపడ్డారని తెలుసుకున్నారు. చిరంజీవి ఎదుగుదలను చూసి సహించలేని కొంతమంది కుట్ర వలన అలా జరిగిందనే విషయం అంతటా గుప్పుమంది. అప్పట్లో జాతీయస్థాయి పత్రికలోను ఇది ప్రధానవార్తగా నిలిచింది. అప్పట్లో మీడియా ఈ స్థాయిలో లేదు గనుక, చాలామందికి ఈ విషయం తెలియదు. ముఖ్యంగా ఇప్పటి యూత్ కి అసలే తెలియదు. అప్పట్లో డూప్ లేకుండా ఫైట్స్ చేసే చిరంజీవి, ప్రమాదాలనే కాదు .. ఇలాంటి ఆపదలను కూడా ఎదుర్కొన్నారు. మెగాస్టార్ గా నిజమైన అభిమానుల నుంచి నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారు.                  
Tags:    

Similar News