ప్రణబ్ మరణంపై పవన్ - మహేష్ దిగ్భ్రాంతి

Update: 2020-09-01 07:15 GMT
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశంలో ఒక రాజకీయ శకం ముగిసింది. దాదా మరణం  ప్రజలందరినీ కలచివేసింది. దేశ వ్యాప్తంగా  రాజకీయ నాయకులు, సినీ నటులు, వివిధ రంగాల ప్రముఖులు  తమ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకు  తుది వీడ్కోలు పలుకుతున్నారు. జనసేన అధినేత,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రణబ్ మరణంపై ట్విట్టర్ ద్వారా తన సంతాపం వ్యక్తం చేశారు. ' ప్రణబ్ ముఖర్జీ మరణం వార్త విని తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యా. ప్రణబ్ భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన పలు సంస్కరణలు తీసుకు వచ్చారు. దేశానికి రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలను మర్చిపోని విలక్షణత  ఆయన సొంతం. దిగ్గజ నాయకుడి మరణం దేశానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి నా తరపున, జనసేన పార్టీ తరపున సానుభూతి తెలియజేస్తున్నానని' పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

ప్రణబ్ ముఖర్జీ మరణవార్త తీవ్రమైన విషాదాన్ని మిగిల్చిందని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. 'రాజకీయ కోవిదుడి మరణంతో దేశం మూగబోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని  ప్రార్థిస్తున్నట్లు ' మహేష్ బాబు ట్వీట్ చేశారు.  ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, మంచు లక్ష్మి, తాప్సీ, బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా తమ మాజీ రాష్ట్రపతి మరణంపై తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Tags:    

Similar News