రాజాసాబ్ థియేటర్ లో మంటలు.. పెను ప్రమాదమే తప్పింది

ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో ఉండే జోష్ వర్ణనాతీతం. ది రాజా సాబ్ సినిమాతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.;

Update: 2026-01-09 10:44 GMT

ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో ఉండే జోష్ వర్ణనాతీతం. ది రాజా సాబ్ సినిమాతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరోను వెండితెరపై చూసి ఫ్యాన్స్ పరవశించిపోతున్నారు. అయితే ఈ ఉత్సాహం కొన్ని చోట్ల హద్దులు దాటుతోంది. ఒడిశాలోని రాయగడలో ఉన్న అశోక్ థియేటర్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సాధారణంగా సినిమా రిలీజ్ రోజున పేపర్లు చల్లడం, ఈలలు వేయడం వంటివి చూస్తుంటాం. ఇవన్నీ ఫ్యాన్స్ చూపే ప్రేమలో భాగమని అందరూ సరిపెట్టుకుంటారు. రాయగడ థియేటర్లో మాత్రం పరిస్థితి మరీ విభిన్నంగా కనిపించింది. ప్రభాస్ గెటప్స్ చూసి ఊగిపోయిన కొందరు ఫ్యాన్స్ తమ ఆనందాన్ని ప్రదర్శించడానికి ఊహించని మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది అక్కడున్న మిగతా ప్రేక్షకులను సైతం కాసేపు ఆందోళనకు గురిచేసింది.

థియేటర్ లోపల ప్రభాస్ ఎంట్రీ సీన్ వస్తున్న సమయంలో కొందరు అభిమానులు నిప్పు రాజేశారు. స్క్రీన్ ముందు కాగితాలు వేసి వాటికి నిప్పు పెట్టడంతో థియేటర్ అంతా పొగతో నిండిపోయింది. ఆ సమయంలో స్క్రీన్ కు సమీపంలో మంటలు ఎగిసిపడటంతో థియేటర్ యాజమాన్యం ఒక్కసారిగా షాక్ కు గురైంది. కేవలం సినిమాపై ఉన్న అభిమానంతో చేసిన ఈ పని చూస్తుంటే పిచ్చి పీక్స్ కు చేరిందనిపిస్తోంది. మళ్లీ తోటి అభిమానులే దాన్ని ఆర్పేశారు.

ఇలాంటి పనులు చేసేటప్పుడు ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటనేది ఎవరూ ఆలోచించడం లేదు. ఒకవేళ ఆ మంటలు థియేటర్ లోని కుర్చీలకు లేదా స్క్రీన్ కు అంటుకుంటే భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. అభిమానులు వందలు వేలు పెట్టి టికెట్లు కొని ఎంజాయ్ చేయాలనుకోవడం తప్పు కాదు. ఇలా నిప్పుతో చెలగాటం ఆడితే థియేటర్ యజమానికి లక్షలు కోట్లలో డ్యామేజ్ జరుగుతుంది. ప్రాణ నష్టం జరిగే రిస్క్ కూడా ఉంటుంది.

సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే అన్న విషయాన్ని ఫ్యాన్స్ గుర్తించాలి. తమ సంబరాలు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలు కోట్లు పెట్టి థియేటర్లు నిర్మించే యజమానులు ఇలాంటి సంఘటనల వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారు. రాయగడ ఘటనలో పెను ప్రమాదం తప్పినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఫ్యాన్స్ బేస్ చాలా పెద్దది. ఇలాంటి పిచ్చి చేష్టల వల్ల హీరోల ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంది. పండగ పూట ఆనందంగా సినిమా చూసి రావాలి కానీ ఇలాంటి ప్రమాదకరమైన పనులతో ఇంటికి టెన్షన్ తీసుకెళ్లకూడదు. బాధ్యతాయుతమైన అభిమానిగా ఉంటూ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటేనే ఆ సినిమా విజయానికి నిజమైన గౌరవం దక్కుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.




Tags:    

Similar News