గ్రీట్ & మీట్.. స్పెషల్ అట్రాక్షన్ గా విరోష్ జంట!

ఈరోజు (మార్చి 4) సాయంత్రం హైదరాబాద్‌లో సినీ రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ జరగనుంది.;

Update: 2026-03-04 15:20 GMT

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ 'విరోష్' (విజయ్-రష్మిక) పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో అట్టహాసంగా ఒక్కటైన ఈ జంట, పెళ్లి తర్వాత కూడా తమదైన శైలిలో వార్తల్లో నిలుస్తున్నారు. కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాకుండా, తమను ఆరాధించే అభిమానుల కోసం విజయ్-రష్మిక ఏర్పాటు చేసిన స్పెషల్ 'లంచ్ డేట్' ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హోదాను పక్కన పెట్టి, సామాన్యులతో కలిసి గ్రేట్ అండ్ మీట్ పేరిట బంతి భోజనాల్లో సందడి చేసిన ఈ నవదంపతుల ముచ్చట్లు మీకోసం..

అభిమానులకు బంతి భోజనాలు - రష్మిక ముద్దలు:

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగడానికి ముందు, మంగళవారం నాడు దాదాపు 200 మందికి పైగా అభిమానులతో ఒక ప్రత్యేకమైన 'ఫ్యాన్ మీట్-అప్' ఏర్పాటు చేశారు. "ప్రేమతో మీ VIROSH" అనే బోర్డుతో అభిమానులకు ఘనస్వాగతం పలికారు. కేవలం భోజనం పెట్టడమే కాదు, విజయ్ మరియు రష్మిక ఇద్దరూ స్వయంగా వడ్డన చేయడం చూసి అభిమానులు మురిసిపోయారు. ఇక భోజనం చేస్తున్న సమయంలో రష్మిక తన చేతులతో విజయ్‌కు ముద్దలు తినిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అభిమానుల పట్ల వారికున్న ప్రేమకు ఇది నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నేడు హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ - ప్రధానికి ఆహ్వానం:

ఈరోజు (మార్చి 4) సాయంత్రం హైదరాబాద్‌లో సినీ రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ జరగనుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన టాప్ సెలబ్రిటీలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఈ వేడుకకు ఆహ్వానించడం విశేషం. ఇక భద్రతా కారణాల దృష్ట్యా ఈ వేడుకను కేవలం ఆహ్వానితులకు మాత్రమే పరిమితం చేశారు. ఒక పక్క తమ సినిమాలతో బిజీగా ఉంటూనే, మరో పక్క వ్యక్తిగత జీవితాన్ని ఇలా పద్ధతిగా, సమాజానికి ఉపయోగపడేలా ప్లాన్ చేసుకోవడం పట్ల 'విరోష్' జంటపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

సొంత గ్రామంలో సందడి - చదువుల కోసం స్కాలర్‌షిప్:

పెళ్లి ముగిసిన వెంటనే ఈ కొత్త జంట విజయ్ దేవరకొండ సొంత గ్రామమైన తుమ్మనపేటను సందర్శించారు. అక్కడ తమ కొత్త ఇంట్లో గృహప్రవేశంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. గ్రామ ప్రజలందరికీ స్వయంగా భోజనాలు పెట్టించి, పట్టుచీరలో రష్మిక, కుర్తాలో విజయ్ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Tags:    

Similar News