డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం.. శుభకార్యం జరిగిన కొన్ని రోజులకే.. ఎమోషనల్ పోస్ట్!
ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుభకార్యం జరిగిన కొన్ని రోజులకే ఇలా విషాద ఛాయలు అలుముకోవడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.
ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుభకార్యం జరిగిన కొన్ని రోజులకే ఇలా విషాద ఛాయలు అలుముకోవడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. విషయంలోకి వెళ్తే.. మెహర్ రమేష్ చిన్న అక్క మెహర్ జ్యోతి సుంకర సోమవారం రాత్రి విజయవాడలో తుది శ్వాస విడిచారు. గత 14 రోజులుగా తీవ్రమైన వైరల్ న్యూమోనియాతో బాధపడుతున్న ఈమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషాద వార్తను మెహర్ రమేష్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా తన సోదరితో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈ మేరకు మెహర్ రమేష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా.. "నా ప్రియమైన చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర ఈరోజు (జూలై 21) రాత్రి 9:45 నిమిషాలకి విజయవాడలో స్వర్గస్తులయ్యారు. వైరల్ న్యూమోనియాతో గత 14 రోజులుగా ఆమె చికిత్స పొందుతూ.. అనంత లోకాలకు వెళ్లిపోయారు. నాకు చిన్నప్పటినుండి తను నా అండ.. ప్రేమగా నా కూతురి పెళ్లి కూడా దగ్గరుండి జరిపించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో ఆనందపడిన మా అక్క.. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి ఇంత తొందరగా వెళ్ళిపోవడం మా కుటుంబానికి తీరని లోటు" అంటూ మెహర్ రమేష్ కన్నీటి పర్యంతమయ్యారు. తన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి అయిన తన అక్క ఇంత త్వరగా తమను వదిలి వెళ్ళిపోవడం తీరని లోటు అంటూ మెహర్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే మెహర్ రమేష్ ఇటీవల తన కూతురి పెళ్లిని చాలా ఘనంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే శుభకార్యం జరిగిన ఆ ఇంట ఇప్పుడు ఇలా విషాదం చోటు చేసుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ విషాదవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా మెహర్ రమేష్ కి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. జ్యోతి ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
మెహర్ రమేష్ విషయానికి వస్తే.. గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ అందుకోలేదు. చివరిగా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేశారు. కీర్తి సురేష్, చిరంజీవి, తమన్నా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా .. అటు కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న మెహర్ రమేష్ నటుడిగా ఒక్క కొత్త చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం.