ఒకే రోజు 9 సినిమాలు... బరిలో ప్రభాస్‌ కూడా!

తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెద్ద సినిమాలు చాలా తక్కువగా వస్తాయి.;

Update: 2026-03-04 11:30 GMT

తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెద్ద సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. పరీక్షల సీజన్‌ కావడంతో ఈ రెండు నెలలు కూడా పెద్ద సినిమాల సందడి కనిపించదు. ఎవరైనా ధైర్యం చేసి, తప్పని పరిస్థితుల్లో తప్ప విడుదల చేసే పరిస్థితి లేదు. చిన్న సినిమాలు మాత్రం వరుసగా వస్తూనే ఉంటాయి. గడిచిన నాలుగు.. ఐదు ఏళ్లుగా ఈ అన్‌ సీజన్‌లో ఎక్కువగా చిన్న సినిమాలు రావడం మనం చూస్తూ ఉన్నాం. గత వారం పలు సినిమాలు విడుదల అయ్యాయి. ఇక ఈ వారం సైతం బాక్సాఫీస్ వద్ద వార్‌ కి పలు సినిమాలు రెడీగా ఉన్నాయి. మూడు నాలుగు కాకుండా ఏకంగా 9 సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రంగంలోకి దిగబోతున్నాయి. ఆ 9 సినిమాల్లో ఒకటి ప్రభాస్ మూవీ కూడా ఉండటం విశేషం. ప్రభాస్‌ 'మున్నా' సినిమాను ఈ శుక్రవారం రీ రిలీజ్ చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ మున్న రీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మున్న రీ రిలీజ్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌...

ప్రభాస్‌ మున్న సినిమా రీ రిలీజ్ కాకుండా ఇంకా 8 సినిమాలు విడుదల కాబోతున్నాయి. శివాజీ ముఖ్య పాత్రలో నటించి, నిర్మించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో శివాజీకి జోడీగా లయ నటించడంతో హిట్‌ ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిది హిట్‌ పెయిర్‌గా గుర్తింపు ఉంది. అందుకే ఈ సినిమాపై అంచనాలు మొదటి నుంచి పెరుగుతూ వచ్చాయి. శివాజీ ఈ మధ్య కాలంలో మంచి రైజింగ్‌లో ఉన్నాడు. ఆయన నటించిన కోర్ట్‌, దండోరా మరికొన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఈ సినిమా పై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందా అనేది మార్చి 6న విడుదలైన తర్వాత తేలిపోనుంది.

శివాజీ 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాతో...

'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాతో పాటు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన 'సరస్వతి' సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ప్రకాష్ రాజ్‌, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం వరలక్ష్మి చాలా ప్రచారం చేశారు. సినిమా అనౌన్స్‌మెంట్‌ మొదలుకుని పలు విషయాలను చాలా క్రియేటివ్‌గా పబ్లిసిటీ చేయడం ద్వారా సరస్వతి సినిమాలో మ్యాటర్ ఏమైనా ఉండి ఉంటుంది అనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సినిమాను థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. నటిగా తనను తాను నిరూపించుకున్న వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఈ సినిమాతో దర్శకురాలిగా సక్సెస్ అవుతుందా అనేది చూడాలి. చాలా అరుదుగా మాత్రమే నటిగా నటిస్తూ, దర్శకత్వం వైపు వెళ్లిన వారిని చూశాం. మరి ఈ సినిమాతో వరలక్ష్మి అరుదైన రికార్డ్‌ ను సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.

మృత్యుంజయ సినిమాతో శ్రీవిష్ణు...

గత వారం విష్ణు విన్యాసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో శ్రీవిష్ణు ఈ వారం 'మృత్యుంజయ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత వారమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా కూడా విష్ణు విన్యాసం సినిమా కారణంగా ఆలస్యం అయింది. శ్రీవిష్ణు సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలవుతుంది. కచ్చితంగా ఈ సినిమాలో కూడా అలాంటి మంచి ఎలిమెంట్స్ ఉంటాయని, విష్ణు సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఇష్టపడుతారు అంటూ మేకర్స్ చెబుతున్నారు. ఇవే కాకుండా ఇంకా మెన్షన్‌ హౌస్‌ మల్లేష్‌, విధాత, చేష్మరాజా సెల్ఫీ రాణి, మిషన్ సి 1000, కాన్‌(డబ్బింగ్‌) సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల ఈ సినిమాలకు థియేటర్ల సమస్య ఉండక పోవచ్చు. పాజిటివ్‌ టాక్ దక్కించుకున్న సినిమాలకు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. మరి ఇన్ని సినిమాల్లో ఏ సినిమాలు ఈ వారం బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలుస్తాయి అనేది చూడాలి.

Tags:    

Similar News