ట్రైలర్ టాక్: 'రామాయణం' లాంటి ఆఫ్రికన్ పురాణేతిహాస కథతో!
| ‘చిల్డ్రన్ ఆఫ్ బ్లడ్ అండ్ బోన్’ కొత్త ట్రైలర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. పశ్చిమ ఆఫ్రికా పురాణాల నేపథ్యంలో జీనా ప్రిన్స్-బైత్‌వుడ్ తెరకెక్కించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్‌లో థుసో ఎంబెడు, అమాండ్లా స్టెన్‌బర్గ్ ప్రధాన పాత్రలు పోషించారు. భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రం 2027 జనవరి 15న విడుదల కానుంది.
అడవిలో ఆదివాసీలు.. వారి గ్రామ దేవత.. ఆచారాలు.. సంస్కృతి సాంప్రదాయాలు.. వాటితో ముడిపడిన పురాణ గాధలు.. జానపద ఇతిహాసాలలో నిక్షిప్తమైన ఇలాంటి కథలతో సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది? నేటి అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని భారీ విజువల్ ట్రీట్ ని అందించాలంటే..!
పారామౌంట్ పిక్చర్స్ నిర్మించిన భారీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం `చిల్డ్రన్ ఆఫ్ బ్లడ్ అండ్ బోన్` కొత్త ట్రైలర్ తాజాగా విడుదల కాగా దానికి అద్భుత స్పందన వచ్చింది. `ది ఉమెన్ కింగ్` ఫేమ్ జీనా ప్రిన్స్-బైత్‌వుడ్ దర్శకత్వంలో.. టోమీ అడెయెమి రచించిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. పశ్చిమ ఆఫ్రికా సంస్కృతి నేపథ్యంలోని `ఒరీషా` అనే కల్పిత రాజ్యంలో సాగే ఈ కథలో... అణచివేతకు గురైన తమ ప్రజలకు కోల్పోయిన మాయాశక్తులను తిరిగి తీసుకురావడానికి జెలి అడెబోలా (థుసో ఎంబెడు) అనే యువతి చేసే సాహసోపేత ప్రయాణాన్ని చూపించనున్నారు.
తన సోదరుడితో పాటు యువరాణి అమారి (అమాండ్లా స్టెన్‌బర్గ్), యువరాజు ఇనాన్ (డామ్సన్ ఇద్రిస్) సహాయంతో క్రూరమైన రాజు సరన్ (చివెటెల్ ఎజియోఫోర్) పాలనకు వ్యతిరేకంగా జెలి సాగించే పోరాటమే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ప్రత్యేకంగా ఐమాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరించిన ఈ సినిమాలో వయోలా డేవిస్, ఇద్రిస్ ఎల్బా, సింథియా ఎరివో, రెజీనా కింగ్, లషానా లించ్ వంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషించగా... గ్రామీ విజేత టెమ్స్ సంగీతం అందించారు.
గత జులైలో విడుదలైన మొదటి టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో కొంత నిరాశ చెందిన అభిమానుల్లో ఈ కొత్త ట్రైలర్ సరికొత్త ఉత్సాహాన్ని, ఊరటను నింపింది. వేగంగా సాగే కథనం.. భారీతనం నిండిన విజువల్ స్కేల్.. ఆఫ్రికన్ పౌరాణిక గాథలను తెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నవలలోని అసలైన ఆత్మను ఈ ట్రైలర్ ఆవిష్కరించిందని.. ఇందులోని భారీ యాక్షన్ కొరియోగ్రఫీ.. విజువల్స్ .. ఆస్కార్ విజేత టెమ్స్ నేపథ్య సంగీతం `బ్లాక్ పాంథర్`, `ది ఉమెన్ కింగ్` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను గుర్తుకు తెస్తున్నాయని సినీ విశ్లేషకులు అభినందిస్తున్నారు. భారతీయ పురాణేతిహాసం `రామాయణం`.. గ్రీక్ పురాణేతిహాసం `ది ఒడిస్సీ`లను మించేలా ఈ ఆఫ్రికన్ ఇతిహాసం అలరిస్తుందని నెటిజనులు ఊహిస్తున్నారు.
2027 జనవరి 15న థియేటర్లు- ఐమాక్స్ స్క్రీన్‌లలో ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ ట్రైలర్‌లో కథలోని కొన్ని కీలక మలుపులను ముందే రివీల్ చేశారని కొందరు నవలా పాఠకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే గతంలో తెరవెనుక క్రియేటివ్ విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి రచయిత టోమీ అడెయెమి బహిరంగంగా తప్పుకున్న అంశంపై కూడా ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తి కొనసాగుతోంది. తాజా ట్రైలర్‌కు వస్తున్న అద్భుతమైన స్పందనతో 2027 బాక్సాఫీస్ వద్ద అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రాల్లో ఒకటిగా `చిల్డ్రన్ ఆఫ్ బ్లడ్ అండ్ బోన్` నిలిచింది.