బాలీవుడ్ ప్రయాణం వర్కౌట్ అవుతుందా?
2025 డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.;
పాన్ ఇండియా సినిమా ట్రెండ్ మొదలైన తర్వాత చాలామంది ప్రాంతీయంగా సినిమాలను తెరకెక్కిస్తూ.. వాటిని ఇతర భాషలలో డబ్ చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ మధ్యకాలంలో ప్రాంతీయంగా సినిమాలు చేసి విడుదల చేసిన తర్వాత.. అక్కడ సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందనను చూసి ఆ తర్వాతే మిగతా భాషలలో డబ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రముఖ స్టార్ కిడ్ ఆది సాయికుమార్ తాజాగా శంభాల అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
2025 డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఆది సాయికుమార్ హీరోగా , అర్చన అయ్యర్ , రవి వర్మ, స్వాసిక తదితరులు కీలకపాత్రలు పోషించారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో ఆది తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే వరుస పరాజయాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఆది సాయికుమార్ ఇప్పుడు తెలుగులో మంచి విజయం అందుకొని.. ఇప్పుడు హిందీ మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఈరోజు అనగా జనవరి 9న ఈ సినిమా హిందీలో డబ్బింగ్ వెర్షన్ విడుదల అయింది.
ఆసక్తికరమైన నేపథ్యం, అద్భుతమైన ప్రదర్శనలతో హిందీ వెర్షన్ పై అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా ఏకంగా పాన్ ఇండియా భాషల్లో విడుదలైంది. రెబల్ స్టార్ ప్రభాస్ కి పాన్ ఇండియా వైడ్ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా శంభాల హిందీలో రిలీజ్ అయింది. మరి రాజాసాబ్ పోటీని ఎదుర్కోవడం అత్యంత సవాలుగా మారిన విషయం ఇది.
పైగా ఇటు తెలుగులో ది రాజాసాబ్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ శంభాల సినిమా అటు హిందీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా లేదా అనే విషయంపై ట్రేడ్ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. మరి భారీ అంచనాల మధ్య తన సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేసి మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్న ఆది సాయి కుమార్ కి ఈ సినిమా అక్కడ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ప్రముఖ సీనియర్ సినీ నటుడు సాయికుమార్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయికుమార్ 2011లో ప్రేమ కావాలి అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాతో ఉత్తమ నటుడు విభాగంలో సౌత్ ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్న ఈయన.. సైమా ఉత్తమ తెలుగు నటుడిగా కూడా అవార్డు లభించింది.ఆ తర్వాత లవ్లీ, సుకుమారుడు, శమంతకమణి వంటి చిత్రాలలో నటించారు.