ప్రశాంతంగా పవర్ స్టార్ తో వారిద్దరేనా!
వీరందరు పవన్ విషయంలో ఒక ఎత్తైతే? త్రివిక్రమ్, హరీష్ శంకర్ మాత్రం మరోలా కనిపిస్తారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా డైరెక్ట్ చేయడాన్ని ప్రతీ డైరెక్టర్ గా ఓ డ్రీమ్ గా భావిస్తుంటారు. దర్శకుడిగా కెరీర్ ముగిసేలోపు ఒక్క సినిమా చేసినా చాలు అని భావిస్తారు. కానీ పవన్ తో అవకాశం అంత సులభం కాదు. కానీ వరించిదంటే ఎంతో లక్కీగానే భావించాలి. పవన్ కళ్యాణ్ 28 ఏళ్ల నట ప్రస్థానంలో ఇప్పటి వరకూ దాదాపు 25 మంది దర్శకులతో సినిమాలు చేసారు. మూడు సినిమాలు త్రివిక్రమ్ చేయగా, రెండేసి సినిమాలు పూరి జగన్నాధ్, హరీష్ శంకర్, ఎస్ జెసూర్య, భీమనేని శ్రీనివాసరావు , కరుణాకరన్, కిషోర్ కుమార్ పార్థసాని చేసారు.
మిగతా దర్శకులంతా ఒక్కో సినిమా చొప్పున పని చేసారు. మరి వీరంతా పవన్ కళ్యాణ్‌తో సంతోషంగా పని చేసారా? అంటే సమాధానం అంత సులభం కాదు. ముఖ్యంగా పూరి జగన్నాధ్ కు-పవన్ కళ్యాణ్ కు క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తిన సందర్భాలున్నాయి. తొలి సినిమా `బద్రీ` కి ఎలాంటి డిఫరెన్సెస్ రాలేదు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ సినిమా తర్వాత అదే పూరి పవన్ తో మరో సినిమా తీయడానికి ఏకంగా 12 ఏళ్లు సమయం పట్టింది. అదే `కెమెరా మేన్ గంగతో రాంబాబు`. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయి.
పూరి కథలో పవన్ వేలు పెట్టాడని..అలాంటి హీరోతో సినిమా ఏంటని? పూరి కాస్త అసహనం వ్యక్తంచేసినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ పూరి-పవన్ కలిసి పని చేసింది లేదనుకోండి. మిగతా దర్శకులెప్పుడు పవన్ గురించి ఎలాంటి కామెంట్లు చేసింది లేదు. అవకాశం రావడమే గగనంగా భావించి పని చేసుకుని వెళ్లిపోయారు. వాటిలో కొన్ని సినిమాలు విజయం సాధించగా, మరికొన్ని ప్లాప్ అయ్యాయి. వీరందరు పవన్ విషయంలో ఒక ఎత్తైతే? త్రివిక్రమ్, హరీష్ శంకర్ మాత్రం మరోలా కనిపిస్తారు.
పవన్ తో త్రివిక్రమ్ తొలి సినిమా తీయడంతో ఇద్దరి మధ్యా ర్యాపో బిల్డ్ అయింది. ఆ తర్వాత కాలంలో అది మంచి స్నేహంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు బెస్ట్ ప్రెండ్స్ గా మారిపోయారు. పవన్ గురించి గురూజీ ప్రతీ సందర్భంలోనూ ఎంత గొప్పగా చెబుతాడో తెలిసిందే. పవన్ ని ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంటాడు. ఈ కాంబినేషన్ లో మూడు సినిమాలొచ్చాయి. ఏ రోజు వారిద్దరి మధ్య ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ తలెత్తలేదు. ఒకరికొకరు సర్దుకుని పోయారు. ఒకర్ని ఒకరు ఎంతో గౌరవించుకుంటారు. అలాగే హరీష్ శంకర్ అన్నా పవన్ కు మంచి స్నేహితుడిగా భావిస్తారు. హరీష్ శంకర్ వరుస ప్లాప్ ల్లో ఉన్నా `ఉస్తాద్ భగత్ సింగ్` తో మరో అవకాశం ఇచ్చారంటే? అతడిపై ఎంత నమ్మకం లేకపోతే సాధ్యమవుతుంది. పవన్ వ్యక్తిత్వం గురించి హరీష్ అంతే గొప్పగా చెబుతుంటాడు.