టికెట్ రేట్ పాలసీ వచ్చేదెప్పుడు? అప్పటి వరకు ఇంతేనా?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ పూర్తిస్థాయి, పర్మనెంట్ టికెట్ రేట్ల పాలసీ లేకపోవడమే అసలు సమస్య అని టాక్ వినిపిస్తోంది.;
స్టార్ హీరో ప్రభాస్ నటించిన భారీ మూవీ ది రాజా సాబ్ వ్యవహారం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్ల విధానంలో ఉన్న లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. తెలంగాణలో అనుమతులు లేట్ అవ్వడం వల్ల సినిమా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రాగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముందుగానే అనుమతులు రావడం కొంత ఊరటగా మారింది. అయితే ఇది ఒక్క సినిమాకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ పూర్తిస్థాయి, పర్మనెంట్ టికెట్ రేట్ల పాలసీ లేకపోవడమే అసలు సమస్య అని టాక్ వినిపిస్తోంది. రాజా సాబ్ విడుదల సందర్భంగా తెలంగాణలో టికెట్ ధరలపై చివరి నిమిషం వరకు కూడా స్పష్టత రాలేదు. ప్రీమియర్ షోలు పడాల్సిన సమయంలోనూ ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు అయోమయంలో పడ్డారు. చివరకు అర్ధరాత్రి సమయంలో జీవో జారీ అయింది.
10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అనుమతి ఇచ్చినా, అప్పటికే పడాల్సిన షోలు రద్దు కావడంతో నిర్మాతలకు నష్టం వాటిల్లిందని వాదన ఉంది. విడుదలకు ముందు చేసిన ప్లానింగ్ మొత్తం తారుమారు కావడంతో అంతా గందరగోళం ఏర్పడింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి వేరేగా కనిపించింది. అక్కడ రాజా సాబ్ కు సంబంధించి టికెట్ ధరల అనుమతులు ముందుగానే రావడంతో అంతా సాఫీగా జరిగింది.
అయితే ఒకే సినిమా.. రెండు రాష్ట్రాల్లో రెండు రకాల అనుభవాలు అన్నట్టుగా పరిస్థితి మారింది. అలా అని ఏపీలో పూర్తిస్థాయి పాలసీ ఉందని చెప్పలేం అన్నదే సినీ వర్గాల అభిప్రాయం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లోనూ సినిమా టికెట్ ధరలపై ఇప్పటికీ సరైన విధానం లేదు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓ విధానం రూపొందించేందుకు ప్రయత్నించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది.
దీంతో అక్కడ కూడా ప్రతి సినిమా విడుదలకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అందుకే రెండు రాష్ట్రాల్లోనూ సినిమా విడుదల అంటే ముందు కథ, దర్శకుడు, హీరోలకంటే టికెట్ రేట్ల అనుమతులే కీలక అంశంగా మారుతున్నాయి. విడుదల తేదీలు, ప్రమోషన్ ప్లాన్, ఫ్రాఫిట్ అంచనాలు అన్నీ ప్రభుత్వ నిర్ణయాల మీదే ఆధారపడే పరిస్థితి పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారిందని నిర్మాతల అభిప్రాయం.
మొత్తంగా చూస్తే రాజా సాబ్ టికెట్ వివాదం.. ఒక సినిమా సమస్య కాదు.. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సరైన టికెట్ రేట్ల పాలసీ అవసరం. దీంతో ఇండస్ట్రీ, ప్రేక్షకులు కోరుతున్న ఆ విధానాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడు తీసుకు వస్తాయన్నది క్వశ్చన్ మార్క్. అప్పటి వరకు సినిమా విడుదలతో పాటు టికెట్ రేట్ల విషయంలో గందరగోళం కొనసాగేలా ఉంది.