చిరు న‌టిస్తున్న `లూసీఫ‌ర్` హిందీలో వెబ్ సిరీస్ గా..!

Update: 2021-08-12 04:36 GMT
మోహన్ లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన లూసీఫ‌ర్ (2019) మాలీవుడ్ లో ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ లో నటించ‌డ‌మే గాక‌.. ఇదే చిత్రంతో ద‌ర్శ‌కుడిగానూ ప‌రిచ‌యం అయ్యారు. అత‌డు ఆరంగేట్ర చిత్ర‌మే అద‌ర‌గొట్టాడ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్నారు. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.

ఇంత‌లోనే ద‌ర్శ‌క‌న‌టుడు పృథ్వీరాజ్ లూసీఫ‌ర్ సీక్వెల్ ను కూడా ప్రకటించాడు. త్వరలో చిత్రీకరణ ప్రారంభమవుతుందని పేర్కొన్నాడు. ఆయ‌న‌ ఈ చిత్రాన్ని హిందీలో ఎనిమిది ఎపిసోడ్ల వెబ్ సిరీస్ గా రీమేక్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది.. ఫైన‌ల్ అయ్యాక పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని అన్నారు. హిందీ రీమేక్ లో మోహన్ లాల్ నటించవచ్చు లేదా ఉండకపోవచ్చు అని కూడా పృథ్వీరాజ్ తెలిపారు. ఇక మోహ‌న్ లాల్ కి హిందీ ప‌రిశ్ర‌మ‌ కొత్త కాదు. గతంలో కంపెనీ .. రామ్ గోపాల్ వర్మ కా ఆగ్ వంటి హిందీ చిత్రాల్లో న‌టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌ల‌యాళంలో బ్లాక్ బస్ట‌ర్ సినిమాల సీక్వెల్స్ తో బిజీ.

జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత మ‌ళ్లీ ఎప్పుడు?

మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ కి టాలీవుడ్ స్టార్ హీరోల‌తో స‌త్సంబంధాలున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో స‌న్నిహిత సంబందాలు ఉన్న హీరో ఆయ‌న‌. ఎయిటీస్ స్టార్ల రీయూనియ‌న్ మీటింగుల్లో చిరు-లాల్ త‌ప్ప‌నిస‌రిగా క‌లుస్తుంటారు. అలాగే ఆయ‌న ఎన్టీఆర్ న‌టించిన జ‌న‌తాగ్యారేజ్ లో కీల‌క పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే. తార‌క్ స‌హా మ‌హేష్ తోనూ గొప్ప అనుబంధం ఉంది. ఇటీవ‌ల మ‌హేష్ బ‌ర్త్ డే సందర్భంగా మోహ‌న్ లాల్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి.. తార‌క్ స‌హా టాలీవుడ్ కొలీగ్స్ కి విధిగా ఆయన విషెస్ తెలియ‌జేస్తుంటారు. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత మ‌ళ్లీ మోహ‌న్ లాల్ తెలుగులో న‌టించేది ఎప్పుడో చూడాలి. మ‌ర‌క్కార్ - రామ్ - బ్రో డాడీ- బారాజ్- ఎల్ 2 ఎంపూర‌న్ అనే మ‌ల‌యాళ చిత్రాల్లో లాల్ నిటిస్తున్నారు. అత‌డు న‌టించిన సీక్వెల్ సినిమా దృశ్యం 2 ఓటీటీలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిన‌దే.




Tags:    

Similar News