టాలీవుడ్ అంటే వాళ్లకు అత్తారిల్లు లాంటిందే?
మంచి సినిమాను భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సొంత భాషా చిత్రంలా అక్కున చేర్చుకుంటారు.;
మంచి సినిమాను భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సొంత భాషా చిత్రంలా అక్కున చేర్చుకుంటారు. తమిళ , కన్నడ, మలయాళ, హిందీ ఇలా ఏ భాష నుంచి రిలీజ్ అయినా అందులో కంటెంట్ ఉంటే? ఆదరణకు నోచుకున్నాయే తప్ప తిరస్కరణకు గురి కాలేదు. వ్యక్తిగత అభిప్రాయాలుగానీ, వివక్ష గానీ ఏ భాషపై ఏనాడు చూపించలేదు. అదే తెలుగు ప్రేక్షకుల గొప్పతనం. భాషకు భాషతో సంబంధం లేదంటూ తెలుగు సినిమా పెద్దలు కూడా ఎప్పుడూ చెప్పే మాట ఇదే. కళకు భాషతో సంబంధం ఏంటని అన్ని భాషా చిత్రాల్ని ఎంతో ప్రోత్సహిస్తారు.
అవసరమైతే వారే రంగంలోకి దిగి ప్రచారం చేస్తారు. అందుకే టాలీవుడ్ అంటే ఫరభాషలకు అత్తారిల్లుగా మారింద న్నది కాదనలేని నిజం. మరి అలాంటి అత్తారింటిపై పరభాషలు తమ మాతృభాషను ఏ స్థాయిలో రుద్దు తున్నారంటే? చివరికి టైటిల్స్ కూడా మార్చకుండా సొంత భాషా టైటిల్స్ తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు భాషకు తగ్గట్టు టైటిల్స్ మార్చేవారు. కానీ కొంత కాలంగా టైటిల్స్ లో ఎలాంటి మార్పులు ఉండటం లేదు. తొలుత ఈ సంస్కృతికి నాంది పలికింది తమిళ సినిమా. అక్కడ స్టార్ హీరోలు నటించిన చాలా సినిమాలు తమిళ టైటిల్స్ తోనే ఈ రెండేళ్ల కాలంగా రిలీజ్ అవుతున్నాయి.
భాషను రుద్దాలనే భావనతో రిలీజ్ చేస్తున్నారా? టైటిల్ మారిస్తే జరగరాని నష్టం జరుగుతుందని మార్చడం లేదా? అన్నది తెలియదు గానీ ఎందుకు? ఆటైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నారు? అని అడిగే నాధుడు మాత్రం ఒక్కడు కూడా లేడు. సూర్య నటించిన `ఈటీ`, `కంగువా`, `కరుప్పు` సహా చాలా సినిమాలు అవే టైటిల్స్ తో రిలీజ్ అయ్యాయి. విక్రమ్ సినిమాలు 'తంగలాన్', 'వీర ధీర సూరన్', శివకార్తికేయన్ నటించిన 'అమరన్', 'ఆయలాన్', 'మదరాసి' టైటిల్స్ తో తెలుగు మార్కెట్ లోకి వచ్చాయి.
తాజాగా ఓ మలయాళ సినిమా కూడా స్వభాష టైటిల్ తోనే తెలుగులో రిలీజ్ అవుతుంది. టివినో థామస్ హీరోగా నటించిన 'పళ్లి చట్టాంబి' అదే టైటిల్ తో తెలుగులో విడుదలవుతుంది. ఈ టైటిల్ చూసి తెలుగు ఆడి యన్స్ ఒక్కసారిగా కంగారు పడ్డారు. టైటిల్ అర్దం కాక, దాని మీనింగ్ తెలియక రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అదే సినిమాకు చక్కని ఓ తెలుగు టైటిల్ పెడితే? అర్దమయ్యేది . ఎంతో అందంగానూ ఉండేది. మరి సినిమాల్ని ఇలా రిలీజ్ చేయడం వెనుక అంతరార్దం ఏంటి? తమ ఐడెంటిటీ కోసం ఇలా చేస్తున్నారా? భాషను పరభాషలో కూడా రుద్దాలనే భావనతోనా? అంటూ తెలుగు ఆడియన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ సహా పెద్దల నుంచి స్పందన కరువైనా ప్రేక్షకుల్లో మార్పు రావడం సంతోషించదగ్గ విషయం. ఈ మార్పు ఓ ఉద్యమంలా మారక ముందే తగు చర్యలు తీసుకుంటారని ప్రేక్షకాభిమానులు ఆశీస్తున్నారు.