విమ‌ర్శ‌లు ఓకే.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు క‌రెక్ట్ కాదు!

కన్నడ చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ KD: ది డెవిల్ మరోసారి వివాదాల కేంద్రంగా మారింది.;

Update: 2026-03-18 17:45 GMT

కన్నడ చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ KD: ది డెవిల్ మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ధృవ సర్జా హీరోగా నటిస్తుండగా, సంజయ్ దత్- నోరా ఫతేహీపై తెర‌కెక్కించిన స‌ర్కే చున‌ర్ అనే ఐటమ్ సాంగ్ ఇటీవల విడుదలై తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ఈ పాటకు సంబంధించిన హిందీ వెర్షన్ లో ఉన్న లిరిక్స్, బోల్డ్ కొరియోగ్రఫీపై నెటిజన్లు, సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

యూట్యూబ్ నుంచి తొల‌గించిన పాట‌

సోషల్ మీడియాలో పెరిగిన వ్యతిరేకతతో పాటు జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC) కూడా స్పందించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అభ్యంతరకర కంటెంట్ ఉందన్న కారణంతో ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించడం కూడా చేశారు. దీంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో డైరెక్ట‌ర్ ప్రేమ్ భార్య, మాజీ హీరోయిన్ రక్షిత ఈ వివాదంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి సాంగ్స్ రావ‌డం ఇదే మొద‌టి సారి కాదు

నెట్టింట తనను ట్యాగ్ చేస్తూ వచ్చిన విమర్శలకు ఆమె ఘాటుగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రక్షిత పేర్కొంటూ, తాను అన్నీ గ‌మ‌నిస్తున్నాన‌ని, చాలామంది త‌న‌ను ట్యాగ్ చేస్తున్నార‌ని, కానీ ఇలాంటి పాటలు ఇదే మొదటిసారి రావడం కాద‌ని, చోళీ కే పీచే, పీలింగ్స్, లాంటి సాంగ్స్ వ‌చ్చిన‌ప్పుడు ఎవరూ ప్రశ్నించలేద‌ని, ఇప్పుడు మా పాట వచ్చినప్పుడు మాత్రం అందరికీ సమస్యగా మారింద‌ని వ్యాఖ్యానించారు.

అయితే ఈ సాంగ్‌పై వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా తోసిపుచ్చకుండా, కొన్ని విమర్శలను రక్షిత అంగీకరించారు. పాటలో కొన్ని లైన్స్‌పై ప్రజలకు అభ్యంతరం ఉండొచ్చని ఒప్పుకున్న ఆమె, సమాజంలో కనిపిస్తున్న సెలెక్టివ్ అవుట్రేజ్ పై ప్రశ్నలు లేవనెత్తారు. సినిమా మొత్తం సెక్స్ గురించి మాట్లాడినా ఎవరూ పట్టించుకోర‌ని, కానీ ఒక పాటలో కొన్ని పదాలు ఉంటే మాత్రం తీవ్ర విమర్శలొస్తాయంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మార్కెటింగ్ స్ట్రాట‌జీగా చూడాలి

ఇక డైరెక్ట‌ర్ ప్రేమ్‌పై వ్యక్తిగత దూషణలు చేయడాన్ని కూడా రక్షిత ఖండించారు. ప్రేమ్ కూడా మీలాగే ఒక కన్నడిగుడ‌ని, ఆయన పనిని విమర్శించవచ్చు, కానీ వ్యక్తిగతంగా దూషించడం సరైన‌ది కాద‌ని, క‌న్న‌డ‌ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నార‌ని పేర్కొన్నారు. ఈ సాంగ్‌ను ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా మాత్రమే చూడాలని, సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొన్ని సార్లు క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకోవాల్సి వస్తుందని ఆమె తెలిపారు.

బాడీ షేమింగ్ చేశార‌న్న ర‌క్షిత‌

ఈ సందర్భంగా తనపై జరిగిన బాడీ షేమింగ్‌పై కూడా రక్షిత స్పందించారు. తన శరీరంపై అనేక రకాలుగా కామెంట్లు వచ్చినప్పటికీ, వాటిని ప్రేమగా స్వీకరించానని, ప్రేక్షకుల ప్రేమనే తాను ఆశిస్తున్నానని చెప్పారు. చివర్లో, ఒక పాట పోయిందని ఆందోళన అవసరం లేదని, దానికంటే మంచి కంటెంట్‌ను తీసుకొస్తామంటూ వినూత్నంగా స్పందించారు ర‌క్షిత‌. మొత్తానికి KD: ది డెవిల్ సాంగ్ వివాదం, దానికి రక్షిత ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News