ఎన్టీఆర్‌కి బిగ్ ఫ్లాపివ్వ‌డానికి అదే కార‌ణం.. ఒప్పుకున్న‌ హ‌రీష్

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన `రామయ్య వస్తావయ్య` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-18 17:52 GMT

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన `రామయ్య వస్తావయ్య` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన సంగ‌తి తెలిసిందే. `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీష్ శంకర్ నుంచి వచ్చిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది? అనే విషయంపై తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. అత‌డు ఇంట‌ర్వ్యూలో తన వైఫల్యాన్ని నిజాయితీగా అంగీకరించారు.

ఈ సినిమా డిజాస్టర్ కావడానికి ప్రధాన కారణం ప్రేక్షకుల్లో ఒక తప్పుడు మైండ్‌సెట్ కలిగించడమేనని హరీష్ శంకర్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా మాస్ సినిమాల్లో విలన్ అంతం కోసం ప్రేక్షకులు క్లైమాక్స్ వరకు ఎదురుచూస్తారు. కానీ ఈ సినిమాలో విలన్ పాత్రను ఫస్టాఫ్‌లోనే చంపేయడం వల్ల కథ అక్కడితో ముగిసిపోయిందనే భావన ఆడియన్స్‌లో ఏర్పడింది. ఆ రాంగ్ మైండ్‌సెట్‌తోనే ప్రేక్షకులు సెకండాఫ్‌లో కూర్చునేలా చేయడం సినిమా ఫలితాన్ని దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు.

స్క్రీన్ ప్లే విషయంలో జరిగిన లోపమే ఈ సినిమా పరాజయానికి దారి తీసిందని హరీష్ శంకర్ స్పష్టం చేశారు. విలన్ ముఖేష్ రిషి పాత్రను మొదటి భాగంలోనే ముగించేయడం వల్ల మిగిలిన కథలో ఇక ఏముంటుంది అనే సందేహం ప్రేక్షకులకు కలిగింది. ఇది కచ్చితంగా తన స్క్రీన్ ప్లే లోపమేనని ఆయన అంగీకరించారు. ఒక బలమైన ప్రతి నాయకుడు లేకపోవడం వల్ల హీరో ఎలివేషన్లకు స్కోప్ తగ్గిపోయిందని ఆయన విశ్లేషించారు.

క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతూ.. విలన్ పాత్ర ఎంత నికృష్టుడిగా ఉంటేనే హీరో చేసే పనులకు ఒక అర్థం, బలం చేకూరుతుందని హరీష్ శంకర్ వివరించారు. రామయ్య వస్తావయ్యలో విలన్ క్యారెక్టర్‌ను అలాగే డిజైన్ చేసినప్పటికీ దానిని ప్లేస్ చేసిన విధానం సరిగ్గా కుదరలేదని ఆయన అంగీక‌రించారు. అందుకే ఆశించిన స్థాయిలో మాస్ ఆడియన్స్‌ను ఈ సినిమా మెప్పించలేకపోయిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అస‌లు ఏ సినిమా హిట్ అవుతుంది ఏది ఫ్లాప్ అవుతుంది అనేది విడుదలయ్యాక మాత్రమే తెలుస్తుందని ఆయన అన్నారు. సినిమా కోసం కష్టపడటం మాత్రమే దర్శకుడి చేతుల్లో ఉంటుందని ఫలితం మాత్రం ప్రేక్షకుల తీర్పుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తానికి ప్రేక్షకుల నాడిని, వారి మైండ్‌సెట్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయిందని హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ విజ‌యంపై హ‌రీష్ ధీమాగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 19 నుంచి ఈ చిత్రం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

Tags:    

Similar News