అభిషేక్ బచ్చన్.. ఇప్పటికైనా దశ తిరిగేనా?

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొత్త సినిమా కింగ్ మీద చాలా రోజులుగా రకరకాల ప్రచారాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2026-08-01 04:52 GMT

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొత్త సినిమా కింగ్ మీద చాలా రోజులుగా రకరకాల ప్రచారాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ యాక్షన్ డ్రామాలో సుహానా ఖాన్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్ తో ఎంట్రీ ఇస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో షారుఖ్ కు మెయిన్ విలన్ గా అభిషేక్ బచ్చన్ నటించబోతున్నాడనే విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. విలన్ గా ఆయన పేరు బయటకు వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఒక రకమైన బజ్ నడుస్తోంది.

ఒకప్పుడు గురు, ధూమ్, బంటీ ఔర్ బబ్లీ, సర్కార్ లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన అభిషేక్ ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోలేక బాగా వెనుకబడ్డాడు. అమితాబ్ కొడుకు అనే బ్రాండ్ ఉన్నా కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. సోలో హీరోగా థియేటర్లలో బ్లాక్ బస్టర్ చూసి చాలా కాలమే అయింది. ఆఫర్స్ తగ్గుతున్న టైమ్ లో తన రూట్ మార్చి ఓటీటీ వైపు అడుగులు వేశాడు.

అక్కడ బ్రీత్ ఇంటూ ది షాడోస్ సిరీస్ తో పాటు దస్వి, లూడో, బాబ్ బిశ్వాస్ లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసి నటుడిగా మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. నిజానికి మణిరత్నం రావణ్ సినిమాలోనే అభిషేక్ నెగిటివ్ షేడ్స్ లో అద్భుతంగా నటించాడు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా నటుడిగా మంచి గుర్తింపు దక్కింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కింగ్ సినిమా రూపంలో ఓ బిగ్ ఆఫర్ అతని ముందుకు వచ్చింది.

గతంలో పఠాన్ లో జాన్ అబ్రహాం, జవాన్ లో విజయ్ సేతుపతి షారుఖ్ కి విలన్స్ గా చేసి ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. హీరోకి ధీటుగా విలన్ క్యారెక్టర్ ఉంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఆ సినిమాలు ప్రూవ్ చేశాయి. కింగ్ లో కూడా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అభిషేక్ పాత్రను ఓ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ లా తీర్చిదిద్దుతున్నట్లు టాక్ నడుస్తోంది. షారుఖ్ కి ఎదురుగా నిలబడి ఢీకొట్టే రోల్ లో అభిషేక్ కరెక్ట్ గా క్లిక్ అయితే అతని కెరీర్ కి మళ్లీ ప్రాణం వచ్చినట్లే.

సుహానా లాంచ్ ప్రాజెక్ట్ కావడంతో షారుఖ్ ఈ సినిమాను ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడు. దీపికా పదుకొనే, రాణీ ముఖర్జీ లాంటి స్టార్లు కూడా ఇందులో ఉన్నారు. 2026 క్రిస్మస్ టార్గెట్ గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ లో అభిషేక్ తన విలనిజంతో ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ఇన్నాళ్లు సరైన బ్రేక్ కోసం చూస్తున్న అతనికి ఈ పాత్ర ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News