'ధురంధర్ - పార్ట్ 3'కి ఇదే ప్రూఫ్.. రెహ్మాన్ డెకాయిత్ డీగ్యాంగ్‌పై దారుణ ఎటాక్!
రణ్‌వీర్ సింగ్- ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో రూపొంది అసాధారణ విజయం సాధించిన భారీ యాక్షన్ ఫ్రాంచైజీ 'ధురంధర్' ఇప్పటికీ నిరంతర వార్తల్లో నిలుస్తోంది.
రణ్‌వీర్ సింగ్- ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో రూపొంది అసాధారణ విజయం సాధించిన భారీ యాక్షన్ ఫ్రాంచైజీ 'ధురంధర్' ఇప్పటికీ నిరంతర వార్తల్లో నిలుస్తోంది. దురంధర్, దురంధర్ 2 చిత్రాలు దాదాపు 3000 కోట్ల వసూళ్లతో సంచలన రికార్డులను నమోదు చేయగా.. మూడో భాగం ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలనే ఉత్కంఠ అందరిలోను ఉంది. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో చోటుచేసుకున్న ఒక నిజజీవిత గ్యాంగ్‌స్టర్ ఉదంతం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్ సోదరుడు జుబైర్ బలోచ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కాల్పులు జరిపారు. లియారీ ప్రాంతంలోని చాకీవారా రోడ్‌లో ఉన్న తన ఇంటి బయట జుబైర్ కూర్చుని ఉండగా... బైక్‌పై వచ్చిన దుండగులు అతడిపైకి వరుసగా గుళ్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే కరాచీ సివిల్ ఆసుపత్రికి తరలించి అత్యవసర సర్జరీ అందిస్తున్నారు.
సినిమాటిక్ కోణంలో చూస్తే.. ఈ ఘటనా పరిణామాలు 'ధురంధర్' ఫ్రాంచైజీకి అత్యంత కీలకమైనవిగా మారే అవకాశం ఉందని అప్పుడే అభిమానులు విశ్లేషిస్తున్నారు. ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అయిన రెహ్మాన్ డెకాయిత్ నమ్మిన బంటుగా.. అతడి ప్రధాన అనుచరుడిగా ఉజైర్ బలోచ్ చరిత్రలో నిలిచాడు. కాగా 'ధురంధర్' సినిమాలో రణ్‌వీర్ సింగ్ పక్కన కనిపించే ఉజైర్ పాత్ర ఈ రియల్ లైఫ్ గ్యాంగ్‌స్టర్ ఆధారంగానే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఉజైర్ బలోచ్ జైలు శిక్ష అనుభవిస్తుండగా...బయట ఉన్న అతడి సోదరుడిపై ఇలాంటి పగడ్బందీ దాడి జరగడం వెనుక గ్యాంగ్ వార్ ఉందనే కోణంలో పాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రియల్ ఇన్సిడెంట్ `ధురంధర్ పార్ట్ 2` కథ ఎక్కడ ముగుస్తుందో, అక్కడి నుంచే `పార్ట్ 3` కథను ప్రారంభించడానికి దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఒక బలమైన ఆధారంగా మారబోతోందా అనే చర్చ మొదలైంది.
ఈ దాడికి సంబంధించి స్థానిక సౌత్ డీఐజీ సయ్యద్ అసద్ రజా తెలిపిన వివరాల ప్రకారం.. 40 ఏళ్ల జుబైర్ ఛాతీ, పొట్ట భాగంలోకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు బాటసారులు కూడా గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 2012లో ఏడు క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయిన జుబైర్ 2025 జనవరిలోనే జైలు నుండి విడుదలయ్యాడు. కాగా ఇటీవలే ఒక రాజకీయ పార్టీలో చేరిన అతడిని లక్ష్యంగా చేసుకుని ముసుగు ధరించిన దుండగులు ఈ దాడికి ఒడిగట్టారు. గతంలో కరాచీ మిలిటరీ ఆపరేషన్ భయంతో దుబాయ్, ఇరాన్‌లకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్లు మళ్లీ తిరిగి వస్తున్నారనే వార్తల మధ్య ఈ ఘోరం జరగడంతో ల్యారీ ప్రాంతంలో మళ్లీ పాత గ్యాంగ్ వార్ భయాల నీడలు కమ్ముకున్నాయి.
రియలిస్టిక్ సినిమాలను, గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఆసక్తిగా గమనించే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కూడా ఆదిత్య ధర్ టేకింగ్‌కు పెద్ద అభిమాని. కరాచీలో జరుగుతున్న ఈ రియల్ లైఫ్ గ్యాంగ్ వార్ ఉదంతంపై ఆర్జీవీ శైలిలో ఎలాంటి విశ్లేషణ వస్తుందోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రియల్ లైఫ్ ఘటనలను రీల్ లైఫ్‌పై మరింత తీవ్రమైన ఎమోషన్, వయోలెన్స్‌తో చూపించడంలో సిద్ధహస్తుడైన ఆదిత్య ధర్ ఈ కరాచీ రక్తపాతాన్ని తన 'ధురంధర్ 3' స్క్రిప్ట్‌లో ఒక ప్రధాన మలుపుగా మార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా మొదలైంది.
అటు నిజజీవితంలో ఉజైర్ బలోచ్ సైనిక కోర్టు ద్వారా 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తుండటం.. ఇటు బయట అతడి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు తెగబడుతుండటం పాకిస్తాన్ రౌడీయిజం చరిత్రలోనే కాక.. బాలీవుడ్ స్పై -గ్యాంగ్‌స్టర్ సినిమాల్లోనూ కొత్త సంచలనాలకు దారితీస్తోంది. గుర్తుతెలియని వ్యక్తుల వరుస దాడులతో పాక్ గ్యాంగ్‌స్టర్లలో భయం పట్టుకోగా... ఈ వరుస పరిణామాలు 'ధురంధర్' ఫ్రాంచైజీకి ఊహించని స్థాయిలో హైప్ తీసుకొస్తున్నాయి. ఈ ఉదంతంతో 'ధురంధర్ పార్ట్ 3'కి బలమైన పునాది పడిందని నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.