వారిపై పోలీసులకు SKN ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?
అయితే ఇటీవల కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ నిర్మాత ఎస్కేఎన్ ను అనుకరిస్తూ పోస్టులు పెడుతున్నాయని ఆయన గుర్తించారు.;
టాలీవుడ్ సినీ నిర్మాత ఎస్కేఎన్ (SKN) తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కఠినంగా స్పందించారు. తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి, తాను నిర్మిస్తున్న సినిమాతోపాటు అందులో నటిస్తున్న నటీనటులపై అవమానకరమైన, తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్న కొందరిపై ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.
అయితే ఇటీవల కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ నిర్మాత ఎస్కేఎన్ ను అనుకరిస్తూ పోస్టులు పెడుతున్నాయని ఆయన గుర్తించారు. ఆ పోస్టుల్లో సినిమా గురించి తప్పుడు వార్తలు, నటీనటులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ప్రాజెక్ట్ కు నష్టం కలిగించేలా రూమర్లు వ్యాప్తి చేస్తున్నారని ఎస్కేఎన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ చర్యల వల్ల ప్రేక్షకుల్లో అయోమయం ఏర్పడుతోందని, చిత్ర బృందానికి అనవసరమైన నెగిటివిటీ వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ విషయంపై ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫేక్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో.. వెనుక ఎవరు ఉన్నారో అనే కోణంలో విచారణ సాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు. అంతే కాదు సోషల్ మీడియా ప్లాట్ ఫాంల నుంచి సంబంధిత అకౌంట్ల వివరాలు సేకరించే ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టినట్లు సమాచారం.
అయితే కావాలనే సినిమాకు చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో జరిగిన కుట్రగా భావిస్తున్నట్లు ఎస్కేఎన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా విడుదలకు ముందు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల ప్రేక్షకులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే చట్టపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోమని అన్నారట.
కాగా.. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, సెలబ్రిటీలు, నిర్మాతలు, దర్శకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సినీ నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ అకౌంట్లు, ఫేక్ న్యూస్, ట్రోలింగ్ ల వల్ల వ్యక్తిగత జీవితాలకే కాదు, వృత్తి జీవితాలకు కూడా తీవ్ర నష్టం కలుగుతోందని వారు అంటున్నారు. రోజురోజుకు ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయని చెప్పాలి.
ప్రస్తుతం ఎస్కేఎన్ తాజాగా ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు అయిన కేసు విచారణ దశలో ఉందని, నిందితులను త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారికి గట్టిగా హెచ్చరికగా నిలుస్తుందని సినీ వర్గాలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నాయి. అందుకే అంతా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నాయి. మరి ఎస్కేఎన్ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.