ఆదర్శకుటుంబంలో నారా వారసుడు!
ఓ వైపు హీరోగా నటిస్తూనే ఇతర హీరోల చిత్రాల్లో మంచి పాత్రలు వస్తే నో చెప్పకుండా పనిచేయడం రోహిత్ ప్రత్యేకత.;
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా తివిక్రమ్ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 `శర వేగంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకటేష్ కొన్ని రోజులుగా రెగ్యులర్ గా షూటింగ్ హాజరవుతున్నాడు. చిరంజీవితో కలిసి వెంకీ నటించిన `మనశంకరవరప్రసాద్ గారు` కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో? ఆదర్శకుటుంబం కోసం వెంకటేష్ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. గురూజీ-వెంకీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పక్కా ఎంటర్ టైనర్ ఇది. `మల్లీ శ్వరీ`, `నువ్వు నాకు నచ్చావ్` తరహాలో ఉండే చిత్రంగా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు త్రివిక్రమ్ పేరున్న హీరోలపై పెద్దగా ఆధార పడడు. తాను రాసిన పాత్రలకు చిన్న నటుడు సెట్ అయినా తీసుకుంటాడు. ఎక్కువగా కామెడీ ఆర్టిస్టులపైనే ఆధారపడతాడు. అవసరం మేర ఫాం కోల్పోయిన నటుల్ని ఎంపిక చేస్తుంటారు. తాజాగా ఆదర్శ కుటుంబం కోసం నారా వారబ్బాయి రోహిత్ ను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రోహిత్ సెట్స్ కు వెళ్తున్నాడని సమాచారం. మరి ఆ పాత్ర రోహిత్ కు ఎలాంటి గుర్తింపునిస్తుందో చూడాలి. స్టార్స్ చిత్రాల్లో రోహిత్ ఛాన్స్ వస్తే నటిస్తాడు.
ఓ వైపు హీరోగా నటిస్తూనే ఇతర హీరోల చిత్రాల్లో మంచి పాత్రలు వస్తే నో చెప్పకుండా పనిచేయడం రోహిత్ ప్రత్యేకత. గతంలో మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన `సారొచ్చారు`లో నటించాడు. ఆ తర్వాత త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన `నాయకీ`లోనూ అతిధి ప్రాతతో అలరించాడు. స్నేహితుడు శ్రీవిష్ణు హీరోగా నటించిన `మెంటల్ మదిలో`నూ కనిపించాడు. ఇంకా `నీది నాది ఒకే కథ`లోనూ నటించాడు. అప్పట్లో `ఒకడుండేవాడు` లాంటి చిత్రంలో పోలీస్ పాత్రతోనూ అదరగొట్టాడు. ఇండస్ట్రీలో హీరోగానే ఫిక్స్ అవ్వకుండా మంచి పాత్రలు వస్తే ఎలాంటి చిత్రంలోనైనా నటిస్తున్నాడు.
రోహిత్ లో ఈ లక్షణమే నటుడిగా అతడిని బిజీ చేసిందని చెప్పొచ్చు. చాలా మంది యంగ్ హీరోలు తాము అనుకున్న పాత్రలు వచ్చే వరకూ వెయిట్ చేస్తారు. ఒక్కోసారి సంవత్సరాల పాటు గ్యాప్ కూడా వస్తుంది. కథలు నచ్చలేదనో? పాత్రలు నచ్చలేదనో వెయిటింగ్ లో ఉంటారు. మెగా వేనల్లుడు వైష్ణవ్ తేజ కూడా మూడేళ్లగా కథ కోసం ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ప్రభావం మార్కెట్ పైనే పడే అవకాశం ఉంటుందని హెఓచ్చరించినా పెడచెవిన పెడుతున్నారు. నారో రోహిత్ గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. `భైరవం`, `సుందరకాండ` చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆ సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించలేదు.