నిహారిక 'రాకాస' గ్లింప్స్.. ఇంట్రెస్టింగ్ గా ఉందే!

చీకటి నిండిన గుహలో చేతిలో కాగడాతో ఎవరో నడుస్తున్నట్లు చూపిస్తూ మిస్టరీ వాతావరణాన్ని సృష్టించారు. ఆ తర్వాత వలలో చిక్కుకున్న సంగీత్ శోభన్ ఎంట్రీ ఇస్తారు.;

Update: 2026-01-23 14:52 GMT

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్నారు. సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా ఇప్పటికే కమిటీ కుర్రోళ్లు వంటి బ్లాక్‌ బస్టర్ చిత్రాన్ని అందించిన నిహారిక.. ఇప్పుడు రెండో ప్రాజెక్ట్‌ గా రాకాస అనే సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఆ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఆసక్తికరంగా మారింది.

యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఆ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ మంచి హైప్‌ ను క్రియేట్ చేయగా, తాజాగా మేకర్స్ గ్లింప్స్‌ విడుదల చేసి అంచనాలు పెంచారు. ‘యుగయుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య.. ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు.. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు.. ఈ కథలో ఆ వీరుడు నేనే’ అంటూ ఓ రేంజ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తూ గ్లింప్స్ సాగింది.

చీకటి నిండిన గుహలో చేతిలో కాగడాతో ఎవరో నడుస్తున్నట్లు చూపిస్తూ మిస్టరీ వాతావరణాన్ని సృష్టించారు. ఆ తర్వాత వలలో చిక్కుకున్న సంగీత్ శోభన్ ఎంట్రీ ఇస్తారు. “ఇప్పుడే వచ్చాను కదరా… అప్పుడే పైకి లేపేశారేంటి?” అంటూ ఫన్నీగా డైలాగ్ చెబుతూ నవ్వులు పూయిస్తారు. చివర్లో వెలుతురు మధ్య నుంచి ఆయుధం కనిపించడంతో గ్లింప్స్ ముగుస్తుంది. ప్రస్తుతం గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది.

అయితే తాజా గ్లింప్స్ ద్వారా సినిమా హారర్, ఫాంటసీ, కామెడీ అంశాలతో రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎంటర్టైన్మెంట్ తోపాటు ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినిమా తీస్తున్నట్లు అర్థమవుతోంది. అదే సమయంలో సంగీత్ శోభన్ మార్క్ కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం.

ఇక సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, వాసు ఇంటూరి, రోహిణి, రోహన్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రాజు ఎదురోలు, ఎడిటింగ్ అన్వర్ అలీ అందిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీ విజయ్ నిర్వహిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా.. తాజా గ్లింప్స్ లో కూడా ఆయన వర్క్ అదిరిపోయేలా ఉంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రాకాస సినిమాను ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు వంటి సూపర్ హిట్ తర్వాత నిహారిక నిర్మిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్‌ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఎంటర్టైన్మెంట్, మిస్టరీ, ఫాంటసీ అంశాలతో రూపొందుతున్న రాకాసి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. నిర్మాతగా నిహారిక రెండో ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుందా అనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది.

Full View
Tags:    

Similar News